Friday, May 10, 2024

ఈఏపీ సెట్‌కు దరఖాస్తుల వెల్లువ.. లేట్‌ ఫీజుతో మూడో తేదీ దాకా చాన్స్​

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్‌- 2022కు అభ్యర్థుల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు నమోదయ్యాయి. బుధవారం నాటికి 2 లక్షల 98 వేల 634 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సెట్‌ చైర్మన్‌ ప్రొ. జి. రంగ జనార్దన, కన్వీనర్‌ ప్రొ. ఎం. విజయ్‌ కుమార్‌ తెలిపారు. జేఎన్టీయూ అనంతపురము విశ్వవిద్యాలయం ఉన్నత విద్యా మండలి సహకారంతో ఈఏపీ సెట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొత్తం దరఖాస్తుల్లో ఇంజినీరింగ్‌కు 2 లక్షల 4 వేల 540, అగ్రికల్చర్‌కు 93 వేల 41, రెండింటికి 1053 దరఖాస్తులు నమోదయ్యాయి.

ఈఏపీ సెట్‌కు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఇక నుంచి లేట్‌ ఫీజుతో చేసుకోవాల్సి ఉంటుంది. రూ. వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 25వ తేది వరకు, రూ. 5 వేల అపరాధ రుసుముతో జూలై ఒకటో తేదీ వరకు రూ. 10 వేల లేట్‌ ఫీజుతో జూలై 3వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాటగిరి- 2 విభాగంలో విద్యార్థులు తమ అప్లికేషన్‌లో ఏవైనా కరెక్షన్‌(తప్పులు) ఉంటే ఈ నెల 23 నుంచి 26 వ తేదీ వరకు అనుమతించనున్నారు. హాల్‌ టికెట్లు- ఈ నెల 27 వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వారు తెలిపారు. అంతే కాకుండా దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు మాక్‌ పరీక్షలో పాల్గొని ఆన్‌లైన్‌ పరీక్షకు సన్నద్ధులు కావాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement