Monday, June 17, 2024

Exclusive – చెన్నకేశవా..ఆపలేవా! ఆలయం ప్రాగంణంలో ఆగ‌ని గుప్త‌నిధుల వేట‌


త‌వ్విన గుంత‌లే సాక్ష్యం
సంవ‌త్స‌రాలుగా ఇదే ప‌ని
వంద‌లాదిగా పూడ్చిన గుంతలు
ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోని పోలీసులు
నిలువురాళ్ల విష‌యంలో గుస‌గుస‌లు
ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్ చొర‌వ‌చూపాలి
చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను వెలుగులోకి తేవాలి

- Advertisement -

అర్ధవీడు (ప్రభ న్యూస్): గుప్త నిధుల వేట ఆగలేదు. కొన్ని సంవత్సరాలుగా చెన్నకేశవ స్వామి దేవాలయం కేంద్రంగా ఈ తవ్వకాలు సాగుతున్నాయి. నియంత్రనా చర్యలుగాని, నిధులు పట్టుబడటం గాని జరగలేదు. తాజాగా చెన్నకేశవ స్వామీ ఆలయ పరిధిలో మరోమారు తవ్వకాలు జరిగినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందురోజు తవ్వకాలు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన దాదాపు రెండు వారాలు గ‌డిచినా దీనిపై ఎలాంటి విచార‌ణ జ‌ర‌గ‌లేదు. పోలీసులు యాక్ష‌న్ తీసుకోలేదు. ఆలయానికి పచ్చిమ బాగాన ఎర్రకొండ వైపుగా ఉన్న రావిచేట్టుకు సమీపంలో దీర్ఘ చతురస్త్రాకారంలో పాతి ఉన్న నాలుగు సుద్ద రాళ్ల‌ను తవ్వి తీశారు. ఈ రాళ్లు సుమారు నాలుగు అడుగుల పొడవు ఉన్నాయి. తవ్వకానికి ముందు ఇవి భూమి పైన అర్థడుగు మాత్రమే కనిపించాయి. చాలా పొడవైన రాళ్లు అని గుర్తించిన వారు అక్కడ నిధులు ఉంటాయనే భావనతో తవ్వకాలు జరిపి ఉంటారని తెలుస్తోంది. నిధులకోసం ప్రత్యేక పూజలు చేసిన ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి.

తరచూ తవ్వకాలు ఎందుకు?

ప్రస్తుతం అర్ధవీడు గ్రామానికి ఉత్తరాన సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెన్నకేశవ స్వామీ ఆలయ ప్రాంగణంలో, చుట్టూ పరిసరాల్లో తరుచూ ఇలా తవ్వకాలు సాగుతున్నాయి. కొన్ని శతాబ్దాల క్రిందట ఈ ప్రాంతంలో అర్జునాపురం అనే గ్రామం ఉండేది. తరచూ పిడుగులు పడుతుండటం వల్ల ప్రాణ ఆస్థి నష్టం సంభవిస్తుండేద‌ని, ఈ కారణంగా నివాసానికి యోగ్యమైన ప్రాంతం కాదని భావించిన పూర్వీకులు ప్రస్తుతం అర్ధవీడుగా పిలవబడుతున్న ప్రాంతంలో స్థిర పడ్డారని చెపుతుంటారు. అర్జునాపురం అనే ప్రాంతం అటు చోళ సామ్రాజ్యానికి. ఇటు విజయనగర సామ్రాజ్యానికి సరిహద్దు రహదారిగా ఉండేదని పూర్వీకులు చెబుతున్నారు. ఈ కారణం వల్ల అర్జునాపురం వాసులకు దొంగల బెండద అధికంగా ఉండేద‌ని తెలుస్తోంది. వీరినుండి భద్రత కోసం సంపదను భూమి లోపల దాచేవారని, ఈ విషయాన్నీ గుర్తించిన కొందరు గుడికి స‌మీపంలో పెద్ద ఎత్తున త‌వ్వ‌కాలు చేప‌డుతున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. అయితే.. ఇక్క‌డి చ‌రిత్ర ఆన‌వాళ్ల‌ను వెలుగులోకి తెచ్చేలా ఆర్కియాల‌జీ డిపార్ట్‌మెంట్ వారు చొర‌వ‌చూపాల‌ని, మ‌రుగున‌ప‌డిన చ‌రిత్ర ఆధారాల‌ను చెదిరిపోకుండా చూడాల‌ని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement