Sunday, April 28, 2024

Rain Alert: ఏపీకి వాన గండం.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్ కి మరో తుపాను ముప్పు ముంచుకొస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకు వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్త చెప్పింది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఉత్తరాంధ్రతో పాటు  ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య అండమాన్‌ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం విస్తరించాయి. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో ప్రయాణించి గురువారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడనున్నాయి.

ఇక ఈ అల్పపీడనం రేపటికి తుఫానుగా బలపడి ఆతర్వాత వాయువ్యదిశగా కదిలి డిసెంబరు 4న ఉదయం ఉత్తరాంధ్ర- ఒడిశా సరిహద్దుల్లో తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాయలసీమల్లో రెండు రోజులపాటు ఒకటి రెండుచోట్ల తేలికపాటి జల్లులు పడతాయని తెలిపింది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంబడి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. ఈ నెల 5వ తేదీ వరకు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement