Thursday, May 2, 2024

AP: 98శాతం హామీలు విస్మ‌రించ‌డం చంద్ర‌బాబు ట్రాక్ రికార్డ్ : జగన్‌

98శాతం హామీలు విస్మ‌రించ‌డం చంద్ర‌బాబు ట్రాక్ రికార్డ్ అని సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తుచేసుకోవాలని సూచించారు. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు.

ప్రతీ పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నాను. చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదన్నారు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చేప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతాం. గతంలో 98 శాతం హామీలను ఎగ్గొట్టారు. 2 శాతం హామీలను మాత్రమే నెరవేర్చారు. గత పాలనకు, మన పాలనకు తేడాను మీరే గమనించారు. చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్నారు. సూపర్‌ సిక్స్‌, సెవెన్‌ అంటూ వస్తున్నారు. గతంలో కూడా ముగ్గురు కలిసే వచ్చారు.

ఒక్కరికైనా సెంట్‌ స్థలం ఇచ్చారా?. మనం స్థలం ఇస్తే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. ఒక్క ఇళ్లైనా ఇచ్చారా?. చేనేత కార్మికులకు ఇల్లు, మగ్గం అని చంద్రబాబు మోసం చేశారు. నేతన్న నేస్తం పథకం కింద రూ.970కోట్లు చేనేత కార్మికులకు అందించాం. మగ్గం ఉన్న ప్రతీ కుటుంబానికి చేయూతనిచ్చిన ప్రభుత్వం మనదన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా లబ్ధి జరిగింది. గతంలో ఎప్పుడైనా ఇలాంటి పథకం అములు చేసిన సందర్భం ఉందా ?. నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం రూ.3706 కోట్లు ఖర్చు చేశాం. 1.06లక్షల మందికి లబ్ధి జరిగిందన్నారు. గతంలో లంచాలు ఇస్తే కూడా సంక్షేమ పథకం అందని పరిస్థితి ఉండేదన్నారు.

- Advertisement -

దళారులు లేకుండా అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాం. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం మనది. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలి. 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చలేదు. వాలంటీర్‌ వ్యవస్థతో అవ్వాతాతలకు పెన్షన్‌ అందించిన ప్రభుత్వం మనది. పెన్షన్‌ను రూ.3వేలకు పెంచి అందించే అవకాశం నాకు వచ్చింది.

50 శాతం వెనుకబడిన వర్గాలకు టికెట్‌ ఇచ్చిన ఘనత మనదే. దేశ రాజకీయ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. బీసీలు ఎక్కువగా ఉన్నా.. చంద్రబాబు బీసీలకు సీటు ఇవ్వలేదు. కుప్పంలో కూడా బీసీలే ఎక్కువ.. అక్కడా బీసీలకు టికెట్‌ ఇవ్వరు. మనం మాత్రం చేనేత వర్గానికి చెందిన చెల్లెమ్మెకు టికెట్‌ ఇచ్చాము. మంగళగిరిలో లక్షా 20వేల ఇళ్లున్నాయి. లక్షా 8వేల ఇళ్లకు నేరుగా సంక్షేమ పథకాలు అందించాం. 90 శాతం ఇళ్లకు లంచాలకు తావులేకుండా లబ్ధి జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే నగదు జమ చేసిన ప్రభుత్వం మనదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement