Tuesday, May 14, 2024

Srikakulam: పురుషోత్తపురంలో.. ఐదు దేవాలయాల్లో చోరీ

శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఐదు దేవాలయాల్లో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ సంఘటన జరిగి ఉండవచ్చునని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రముఖ దేవాలయాలు ఉమా కామేశ్వర స్వామి, త్రినాధ స్వామి, విష్ణాలయం, చెరువుగట్టు అమ్మవారి తల్లి, సంతోష్ మాత ఆలయాల్లో చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న బంగారం వెండి ఆభరణాలతో పాటు హుండీలో ఉన్న డబ్బులు కూడా దొంగలు దోచుకుపోయారు. ఉమా కామేశ్వర స్వామి ఆలయంలో వెండి కిరీటం, వెండి పంచ పాత్ర, వెండి ఉద్దరిణి, వెండి పళ్ళెంతో పాటు హుండీలో ఉన్న డబ్బులు, పార్వతీదేవి అమ్మవారి దగ్గర ఉన్న బంగారం కళ్ళు, అమ్మవారి పుస్తెలు చోరీ చేశారు.

బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆలయంలో బంగారం కళ్ళు, వెండి కిరీటాలు వెండి శటగోపము, వెండి పంచి పాత్ర, వెండి పళ్ళాం, వెండి ఉద్దరణితో పాటు హుండీలో వున్న డబ్బులు చోరీకి గురయ్యాయి. గ్రామ మధ్యలో ఉన్న విష్ణు ఆలయంలో అమ్మవారి బంగారు వస్తువులు, వెండి పళ్ళెం, వెండి ఉద్దరిణి, వెండి గిన్నెతో పాటు మరికొన్ని సామాగ్రి చోరీకి గురయ్యాయి. చెరువుగట్టు అమ్మవారి ఆలయంలో హుండీ పగలగొట్టి డబ్బు పట్టుకుపోయారు. సంతోషి మాత ఆలయంలో అమ్మవారు సామాగ్రి, హుండీలో ఉన్న డబ్బులు పట్టుకుపోయారు. గ్రామంలో ఒకేసారి ఇన్ని ఆలయాలు చోరీకి గురికావడంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే దొంగల్ని పట్టుకోవాలని పోలీసులను కోరుతున్నారు. సరుబుజ్జిలు ఎస్సై కు సమాచారం అందించడంతో హుటాహుటిన సిబ్బందితో చేరుకొని దేవాలయాలను పరిశీలించి ఆలయ అర్చకుల వద్ద చోరీకి గురైన వస్తువుల వివరాలు తెలుసుకున్నారు. దర్యాప్తు చేసి అతి తొందరలోనే దొంగలను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement