Friday, May 17, 2024

తెలంగాణ సీఎం ఆదేశాల‌తోనే దాడులు.. రాజ‌కీయ అపోహ‌లు వ‌ద్దున్న డీఐజీ రంగ‌నాథ్‌

నల్లగొండ : గంజాయి ఆపరేషన్ విషయంలో అస‌లేం జ‌రిగింది. వాస్త‌వాలేమిటి.. తెలంగాణ సీఎం చెబితేనే రైడ్స్ చేశాం.. కానీ దీన్ని రాజ‌కీయ అంశంగా ఎందుకు మారుస్తున్నారు..? అనే అంశాల‌ను డీఐజీ రంగ‌నాథ్ మీడియాకు వెల్ల‌డించారు. వై.ఎస్.ఆర్. సిపి ఎంపీ విజయసాయి రెడ్డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా పోలీస్ అధికారి పేరుతో చేసిన ప్రకటనలు పరోక్షంగా తనను ఉద్దేశించి చేసినవిగా భావిస్తూ జరిగిన వాస్తవాలను తెలియజేస్తూ నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు..

ఏ.వో.బి.లో అసలేం జరిగింది..
గంజాయికి అలవాటు పడి యువత దానికి బానిసలుగా మారడం, వారి బంగారు భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని గుర్తించిన తెలంగాణ సీఎం కే.సి.ఆర్. సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణ పోలీసులకు గంజాయి నిర్ములనపై స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. అందులో ముఖ్యంగా తెలంగాణను గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం పోలీసులు గంజాయి రవాణా, నెట్ వర్క్ పై పటిష్ట నిఘా పెట్టాలని అదేశించారని డీఐజీ రంగనాధ్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన నెలన్నర కాలంలో నల్లగొండ జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టి ముమ్మరంగా తనిఖీలు చేయడం జరిగిందన్నారు.

భౌగోళికంగా నల్లగొండ జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉండే జిల్లా అని, జాతీయ రహదారి – 65 నల్లగొండ జిల్లా మీదుగా వెళ్తుందని, ఏ.వో.బి. నుండి నల్లగొండ మీదుగా హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు గంజాయి జాతీయ రహదారి మీదుగా రవాణా అవుతున్నదని, ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లా పోలీసులు నిర్వహించిన తనిఖీలలో వేల కిలోల గంజాయి ఏ.వో.బి. ప్రాంతం నుండి రవాణా అవుతున్న విష‌యం వెలుగుచూసింద‌న్నారు. సుమారు 35 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. గంజాయి రవాణాలో పట్టుబడిన నిందితులంతా విచారణలో ఏ.వో.బి. ప్రాంతం నుండి తీసుకు వస్తున్నట్లుగా చెప్పారని రంగనాధ్ వివరించారు. ఇదే విషయాన్ని నిందితుల కాల్ డేటాతో పాటు సాంకేతిక ఆధారాలతో సహా నిర్ధారించినట్లు వివరించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ అక్టోబర్ 20వ తేదీన ప్రగతి భవన లో గా గంజాయి అంశాన్ని మరోసారి సమగ్రంగా సమీక్షించి గంజాయిని తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిర్ములించాలని సీనియర్ పోలీస్, ఎక్సయిజ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు మరోసారి ఇచ్చారని వివరించారు.

ఏ.వో.బి.లో స్పెష‌ల్‌ ఆపరేషన్….
తాము గంజాయిపై నిర్వహించిన ప్రతి తనిఖీలో దాని మూలాలు ఏ.వో.బి. వైపు చూపించాయన్నారు డీఐజీ రంగ‌నాథ్‌. నల్లగొండ జిల్లాలో పట్టుబడిన ప్రతి గంజాయి నేరస్థుడు విచారణ (ఇంటరాగేషన్) లో ఏ.వో.బి. ప్రాంతం నుండి ఎవరెవరు విక్రయిస్తున్నారు, ఎవరు వ్యాపారం చేస్తున్నారనే విషయాలను వారి పేర్లు, ఊరి పేర్లతో సహా గుర్తించడం జరిగిందని తెలిపారు.

- Advertisement -

ఇదే సమయంలో నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి. (SOURCE) తో పాటుగా గంజాయిని తరలిస్తున్న తెలంగాణలోని హైదరాబాద్ (దూల్ పేట), ఆదిలాబాద్, మహబూబాబాద్, భద్రాచలం, సంగారెడ్డి, నారాయణపేటతో సహా పలు జిల్లాలలో దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. విజయ దశమి రోజున నల్లగొండ జిల్లాకు చెందిన 17 పోలీస్ బృందాలు ఆపరేషన్ గంజా ఇన్ ఏ.వో.బి ప్రారంభించడం జరిగిందన్నారు. ఇదే విషయాన్ని తాను స్వయంగా విశాఖ రురల్ ఎస్పీ కృష్ణారావు, తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు లతో మాట్లాడడం జరిగిందని స్పష్టం చేశారు.

నల్లగొండ నుండి డిటిసి ఎస్పీ సతీష్ చోడగిరి ని ప్రత్యేక అధికారిగా ఏ.వో.బి. ప్రాంతానికి వెళ్లిన బృందాలను సమన్వయం చేయడానికి పంపించడం జరిగిందని, ఆయన వైజాగ్ రూరల్ జిల్లా పోలీస్ గెస్ట్ హౌస్ లో మూడు రోజుల పాటు (అక్టోబర్ 15 నుండి 17 వరకు) ఉండి విశాఖ రూరల్ ఎస్పీ ని సైతం కలవడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తం ఆపరేషన్ లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు పూర్తి సహాయ, సహకారాలు అందించారని, నేరస్తులను పట్టుకోవడంలో అన్ని రకాలుగా సహకరించారని స్పష్టం చేశారు. అదే విదంగా నల్లగొండ పోలీస్ బృందాలు ఏ.వో.బి.లోని తీవ్ర నక్సల్స్ ప్రభావిత మారుమూల గ్రామాలలో ఉంటూ గంజాయి వ్యాపారం చేస్తున్న వారిని ప్రాణాలకు తెగించి మెరుపు దాడులు చేయడంతో పాటు వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు.

ఆక్రోబర్ 17వ తేదీన చింతపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లంబసింగి వద్ద తమ పోలీస్ బృందాలను గంజాయి ముఠాల నుండి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఆత్మరక్షణ కోసం వారిపై కాల్పులు చేయడం జరిగిందని, ఈ ఆపరేషన్ లో వెయ్యి కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రంగనాధ్ వివరించారు. ఆపరేషన్ గంజాయి, ముఖ్యంగా నల్లగొండ పోలీసుల కాల్పుల ఘటనకు సంబంధించిన అన్ని విషయాలను అక్టోబర్ 18 రోజున నల్లగొండలో తాను మీడియాకు వెల్లడించినట్లు ఎస్పీ రంగనాధ్ చెప్పారు. ఇందుకు సంబంధించి తాము విచారణలో తెలుసుకున్న అంశాలను, ఏ.వో.బి. గంజాయి నెట్వర్క్ కు సంబందించిన పూర్తి సమాచారాన్ని అధికారిక పద్ధతిలో నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నివేదిస్తామని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి..
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని రాజకీయ పార్టీలు గంజాయి ఆపరేషన్ విషయంలో చేస్తున్న రాజకీయంలో పోలీసులను, ప్రత్యేకించి తనను లాగదం సరికాదని, మా భుజాల మీద నుండి మీ రాజకీయ అస్త్రాలను సంధించడం దురదృష్టకరమని డీఐజీ రంగ‌నాథ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాము గంజాయి ఆపరేషన్, గంజాయి వ్యాపారం, రవాణా పై చేసిన ప్రకటనలను ఆంధ్రా రాజకీయ పార్టీల నాయకులు ఎవరికి కావాల్సిన విధంగా వారు అన్వయించుకుంటూ వారి రాజకీయ ప్రయోజనాల కోసం తమను వాడుకోవడం సరైన విధానం కాదని చెప్పారు.

రాజకీయాలను పక్కన పెట్టి బాధ్యత కలిగిన నేతలుగా గంజాయిని అన్ని స్థాయిలలో నిర్ములించడం, దేశ భవిష్యత్తును కాపాడడం, దేశంలోని యువత నిర్వీర్యం కాకుండా చూడడం కోసం పని చేయాలని ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులను కోరారు. తాను రాజకీయాలకు అతీతంగా గత నాలుగు సంవత్సరాల కాలం నుండి నల్లగొండ ఎస్పీగా సామాన్య ప్రజలు, సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని నిబద్ధతతో విధి నిర్వహణ చేస్తున్నానని, ఈ విషయాన్ని నల్లగొండ జిల్లాలోని ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులను, మీడియా, ఈ జిల్లా ప్రజలను అడిగి తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా గంజాయి వ్యాపారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరు ఉన్నా, రాజకీయ పార్టీల నాయకులు భాగస్వామ్యం అయినా అలాంటి వారిపై కఠినంగా, నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తమకు నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో, నల్లగొండ జిల్లాను గంజాయి రహిత. ప్రాంతం గా తీర్చిదిద్దడం కోసం, గంజాయి, ఇతర మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్న యువతను కాపాడే దిశలో తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తూనే ఉంటామని, ఈ క్రమంలో గంజాయి స్మగ్లర్లు ఏ.వో.బి. లోనే కాదు కాశ్మీర్ లో ఉన్నా, దేశంలో ఎక్కడ ఉన్నా వారిని పట్టుకొని చట్టం ముందు దోషులుగా నిలబెట్టి వారికి శిక్ష పడేలా పని చేస్తామని నల్లగొండ ఎస్పీ ఏ.వి. రంగనాధ్ స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: గంజాయి రవాణా.. అపోహ‌లు.. వాస్త‌వాలు.. డీఐజీ రంగ‌నాథ్ టార్గెట్ అయ్యారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement