Sunday, April 28, 2024

AP – మీ మేనిఫెస్టో లో మా పాట్లకు చోటు ఇవ్వాలి – ప్రధాన పార్టీలకు సీమ వాసుల లేఖాస్త్రం

తిరుపతి (రాయలసీమ ప్రభన్యూస్ బ్యూరో) : పలురకాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన మౌలిక సమస్యలపై నిర్ణీత కాల ప్రణాళిక తో స్పష్టమైన హామీలను తమ ఎన్నికల మేనిఫెస్టో లలో పొందుపరచాలని అన్ని ప్రధాన పార్టీల అధినాయకత్వాలకు రాయలసీమ వాసులందరి తరపున సాగునీటి సాధన సమితి లేఖలను రాసింది. ఇటీవల రాయలసీమ జిల్లాల్లో పర్యటించిన సమితి నాయకులు నాలుగు చోట్ల సభలు సమావేశాలు నిర్వహించి వివిధ వర్గాల మనోభావాలను సేకరించారు. దేశంలోనే అతితక్కువ వర్షపాతం కలిగిన రాయలసీమ కృష్ణా జలాలు కేటాయింపులలో తీవ్ర వివక్షకు గురి కావడం, వార్షిక బడ్జెట్ లో 15 శాతం నిధుల కేటాయింపులకే పరిమితం కావడం చారిత్రక తప్పిదాలని రాయలసీమ ప్రాంతానికి చెందిన అన్నివర్గాల ప్రతినిధులు స్పష్టం చేసినట్టు సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధ రామి రెడ్డి పేర్కొన్నారు వివిధ వర్గాల నుంచి సేకరించిన అంశాల ప్రాతిపదికన ప్రధాన మైన మౌలిక సమస్యల వివరాలతో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న అన్నిరాజకీయ పార్టీలకు లేఖలు రాసినట్టు తెలిపారు. ఆ లేఖలో నాలుగు ప్రధాన డిమాండ్లను తెలియచేసారు. ఆ డిమాండ్లలో కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు ప్రవహిస్తున్నా సరైన సామర్థ్యంతో రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, పంట కాలువలు లేకపోవడంతో రాయలసీమకు కేటాయించిన నీటిలో 40 శాతం కృష్ణా జలాలను వినియోగించుకొనలేని పరిస్థితి ఉందనీ, ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అత్యంత ప్రాధాన్యతతో రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్ లో నిదులు కేటాయింపులు చేసి రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయడమే కాకుండా, పట్టిసీమ /పోలవరం ద్వారా ఆదా అయిన 80 టిఎంసి ల కృష్ణా జలాలను ఈ ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. చెరువుల నిర్మాణం, పునరుద్దరణ, పెన్నానది పునరుజ్జీవననానికి ‌నిధులు కేటాయించి నిర్దిష్ట కాలవ్యవధితో రాయలసీమ ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలులో భాగంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని లేదా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు,రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరైన కృష్ణా జలాల నీటి పంపిణీకి అనువుగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగీర్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 35 వేల కోట్లతో రాయలసీమ అభివృద్ధి చేపట్టాలని విజ్ఞప్తి చేసారు.

ఈ డిమాండ్లకు సంబందించిన హామీలను వారి వారి ఎన్నికల మేనిఫెస్టో లలో పొందుపరిచి నిర్ణీత కళాపరిమితిలోగా అమలు చేస్తామనే స్పష్టమైన హామీలు ఇవ్వాలని ప్రధాన రాజకీయ పార్టీల అధినాయకులకు లేఖల ద్వారా తెలియచేశామన్నారు.. ఎన్నికల సందర్భంగా రాయలసీమ జిల్లాలకు వచ్చే వివిధ పార్టీల ప్రధాన నాయకుల దృష్టికి కూడా ఈ డిమాండ్లను తీసుకువెళ్ళడానికి కృషి చేస్తామని కూడా ఆయన తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement