Tuesday, May 14, 2024

Anakapalli – చంద్రబాబును నమ్మితే గోవిందా గోవిందా .. జగన్

బిందెడు పన్నీరు బూడిదలో పోసినట్టే
కొండ చిలువ నోట్లో తలపెట్టినట్టే
రైతుల రుణమాఫీకి మంగ‌ళం
డ్వాక్రా రుణాలే కాదు.. సున్నా వడ్డీ రాదు
ఇంటికో ఉద్యోగం రానేరాదు
ఓటుకు నోటు కేసులో ఏపీకి పరారీ
ఇక సూపర్ సిక్స్ తో మోసం తప్పదు
ఇంటింటికి కిలో బంగారం అంటాడు
బెంజికారు అంటాడు
నమ్మి ఓటేస్తే అంతే సంగ‌తులు
చోడవరంలో సీఎం జగన్ సెటైర్ల వర్షం

( ఆంధ్రప్రభ స్మార్ట్, అనకాపల్లి ప్రతినిధి) – చంద్రబాబును నమ్మి ఓటు వేస్తే.. బిందెడు పన్నీరు బూడిదలో కలిపినట్టేనని, ఆయ‌న‌ను నమ్మటమంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్టేనని ఏపీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ ఎన్నికల ప్రచార భేరీ రెండో రోజు సందర్భంగా సోమవారం ఉత్తరాంధ్ర అనకాపల్లి జిల్లా చోడవరం కొత్తూరు జంక్షన్ లో జరిగిన సభలో జగన్ మాట్లాడారు. సభలో జన జాతర కనిపించింది. జగన్ ఆంద్యంతమూ ప్రజలను ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు. మరీ ముఖ్యంగా గోవిందా.. గోవిందా నామస్మరణతో జనాన్ని ఉర్రూతలూగించడ‌మే కాదు.. అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం జరిగే ఎన్నికలు ఎంపీలు, ఎమ్మెల్యేల కోసం కాదు, ప్రతి పేదింటిలో అభివృద్ధి, ప్రతీ పేద కుటుంబం తలరాతను నిర్ణయించే ఎన్నికలన్నారు. జగన్ కు ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయని సీఎం వివరించారు. చంద్రబాబును నమ్మితే.. మోసంతో ప్రజలు ఎలా అతలాకుతలం అవుతారో? నమ్మించి ఏమేమి గోవిందా చేశాడో గుర్తు చేసుకుందామని.. 2014 ముఖ్య హామీలంటూ ఇదే.. అంటూ చంద్రబాబు సంతకం చేసి పవన్ కళ్యాణ్, నరేంద్ర మోదీ సహా మూడు ఫోటోలతో హామీల పాంప్లెట్ చూపిస్తూ గుర్తుందా అని సీఎం జగన్ ప్రశ్నించారు.

- Advertisement -

హామీలన్నీ హాంఫ‌ట్‌..

“జాబు రావాలంటే బాబు రావాలన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఎన్నికలు వచ్చే వరకూ, అయిపోయే వరకూ చెప్పిన మాట ఏంటి. ఇంటింటికి రూ.2వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. అంటే ఐదేళ్లల్లో ఒక్కొక్క కుటుంబానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఇచ్చాడా? ఈ లక్ష 20 వేలు ఏమయ్యాయి..? ఆయన మాట నమ్మి నిరుద్యోగులు, తల్లిదండ్రులు నమ్మి ఓటు వేస్తే ఏం జరిగింది, గోవిందా గోవిందా ” అని జగన్ సెటైర్లు వేశారు. ‘‘ఇది సరే మరో ముఖ్య హామీ రూ. 87,612 కోట్లతో రైతులకు రుణమాఫీ అన్నాడు. బ్యాంకుల్లో బంగారం విడిపిస్తామన్నాడు. పాపం రైతులు నమ్మి ఓటేసి గెలిపిస్తే.. ఏమి జరిగింది? గోవిందా గోవిందా ”అని జగన్ అన్నారు. ఇక అక్కా చెల్లెమ్మలకు రూ. 14, 250 కోట్లు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్నాడు. పాపం మహిళలు నమ్మారు. నమ్మి ఓడు వేస్తే ఏమైంది, గోవిందా గోవిందా”అంతేనా ఇస్తున్న సున్నా వడ్డీ కూడా గోవిందా గోవిందా”అని సీఎం జగన్ అన్నారు. ‘‘ఇంకో ముఖ్య హామీ ఆడబిడ్డ పుడితే 25 వేలు డిపాజిట్ చేస్తామన్నాడు. ఒక్క రూపాయి మీ ఖాతాలో వేశాడా? గోవిందా గోవిందా.. అంతేనా మహాలక్ష్మీ దేవత పేరిట పథకం పెట్టి సీఎం చంద్రబాబు మోసం చేశాడు”అని సీఎం జగన్ విమర్శించారు. ’’ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలం, ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఓటు వేస్తే ఏమైందీ, గోవిందా గోవిందా … కనీసం ఏ పేదవాడికైనా ఒక్క సెంటు స్థలం ఇచ్చాడా?అని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదా గోవిందా గోవిందా

“ హైదరాబాద్ పదేళ్లు రాజధాని కావాల్సింది. ఓటు నోటు కేసులో పారిపోయి వచ్చాడు. ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదాను ఏం చేశాడు? పైగా ప్రత్యేక హోదా సంజీవినా అని మాట్లాడాడు. ప్రత్యేక ప్యాకేజీ గోవిందా గోవిందా. సింగపూరుకు మించిన రాజధాని అన్నాడు. అన్ని వనరులు ఉన్న విశాఖను మర్చి పోయాడు. గ్రాఫిక్స్ రాజధాని ఏమైంది. ప్రతి నగరంలో హైటెక్ సిటీ అన్నాడు. చోడవరంలో కనిపించిందా?గోవిందా గోవిందా. అందరూ ఆలోచన చేయండి . అని సీఎం జగన్ వివరించారు. కనీసం ఒక్క హామీ నెరవేర్చాడా? ఈ పెద్ద మనిషిని నమ్మవచ్చా? సూపర్ సిక్స్ అంటాడు .. సెవెన్ అంటాడు.. ఇంటింటికీ కిలో బంగారం.. అంటాడు ఇవన్నీ నమ్మితే కొండచిలువ నోట్లో తల పెట్టినట్టే .. ఈ కురుక్షేత్ర మహా సంగ్రామం, ఎంపీలు, ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. రాబోయే ఐదేళ్ల పేదల తలరాతలను నిర్ణయించే ఎన్నికలు ఇవి. పొరబాటున చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవటమే. సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టోతో చెప్పే చంద్రబాబు సత్యం ఇది. చోడవరంలో మీ ఇంటిని రక్షించేందుకు పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? అని సీఎం జగన్ ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement