Monday, April 29, 2024

AP Politics – అంతులేని గాంభీర్యం – అంద‌రిలో ఆందోళన

అన్ని పార్టీల‌దీ ఇదే సీన్‌
గెలవాలన్నదే ఏకైక లక్ష్యం
ఒంటరిగా బరిలోకి వైఎస్సార్​ కాంగ్రెస్​
జట్టుగా బైలెల్లిన జనసేన, టీడీపీ
ఎటూ తేల్చుకోలేని బీజేపీ
గెలవకుంటే మనుగడకే పెనుముప్పు
ఇదీ పొలిటికల్​ లీడర్ల మనో వేదన
ప్రచారంలో కొత్త పోకడలు
ప్రజలను ఆకట్టుకునే యత్నాలు షురూ
పథకాలు, ఊరడింపులు, తాయిలాలు
గ్రామాలకు వరసకట్టిన అధినేతలు

(ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి) రాజకీయ క్రీడల్లో గెలుపు, ఓటముల స్ఫూర్తిని గుర్తు చేయకూడదు. ఉన్నది ఒకటే స్ఫూర్తి, ఒకటే లక్ష్యం. అదే విజయం. ఒక్కసారి ఓడినా.. మళ్లీ గెలుస్తామనే భావన, ఆశ క్రీడాస్ఫూర్తిలో కనిపిస్తాయి. కానీ, ఏపీలో ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఒకటే ధ్యేయం. గెలవాలి. గెలవాలి. లేదో బతుకు అగమ్యగోచరమే. ఇదీ ప్రధాన రాజకీయ పార్టీల్లో అంతర్గత ఘోష. ఔను ఆంధ్రాజనం మామూలోళ్లు కాదు. ఒక్క చాన్స్ ఇస్తే… రెండోసారి ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకితేనే పట్టం కడతారు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏళ్లకు ఏళ్లు పాలించిందంటే.. ఆ రోజుల్లో రాజకీయ జ్ఞానం వేరు. కానీ, ఇప్పుడు పరిస్థితి వేరు. అందుకే ఈ ఎన్నికల్లో అటు వైసీపీ కావొచ్చు.. ఇటు టీడీపీ, జనసేన ఉమ్మడి జట్టు కావొచ్చు. ఈ రెండు ప్రధాన పార్టీలకు అధికారం ముఖ్యం. లేకుంటే ఈ పార్టీల మ‌నుగ‌డ‌కే ముప్పు వాటిళ్లే ప్ర‌మాదం ఉంది. అందుకే ఈ ఎన్నికలను చావోరేవో అనే స్థితిలో తీసుకున్నాయి. ఎట్టి పరిస్థితిలోనూ విజయం సాధించాలన్న సంకల్పంతో యుద్ధానికి సిద్ధం అవుతున్నాయి.

సంక్షేమమే ఆయుధంగా..
వైఎస్ఆర్సీపీ ఐదేళ్లుగా ప్రజలతో మమేకమైంది జనం ఆర్థిక కష్టనష్టాలపై దృష్టి సారించి.. రాష్ట్ర బడ్జెట్‌ను సంక్షేమ పద్దుగా మార్చేసింది. ఒకటా రెండా నవరత్నాలు అందించింది. అమ్మ వడి నుంచి గోరుముద్ద వరకూ.. ఒక వర్గం కాదు.. సమాజంలో అన్ని వర్గాలను ఆకట్టుకోవటమే లక్ష్యంగా.. అయిదేళ్ల కిందటి నుంచే ఎన్నికల కసరత్తును ప్రారంభించింది. రాజకీయ చదరంగంలో పావులు కదిపే వ్యూహంలో అధికారమే లక్ష్యం. ఇన్ని చేసినా .. జనానికి లక్షల కోట్లు సమర్పించింది. నిజానికి ఈ ప్రభుత్వం లేకపోతే… తమ నోటికాడ కూడు పోతుందనే ఆందోళననూ సృష్టించింది. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చింది. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను కడవరకూ నిర్వహించిన ఘనత వైసీపీకే దక్కుతుంది. ఇలాంటి స్థితిలో విజయం తథ్యమే. కానీ ఎందుకో వైసీపీ మదిలో ఎడతెగని ఆందోళన కనిపిస్తోంది.

రాజ‌ధాని లేదు.. అభివృద్ధి లేదు..

అదే యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్. రాజధాని లేదు. అభివృద్ధి లేదు. ఈ ప్రశ్నలే వేధిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 2014లో వైసీపీకి 67 సీట్లు వస్తే.. టీడీపీకి 102 సీట్లు వచ్చాయి. 2019లో వైసీపీ 151 సీట్లు, టీడీపీకి 23 సీట్లు వచ్చాయి. వైసీపీకి 49.95 శాతం, టీడీపీకి 39.17 శాతం, జనసేనకు 5.53 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2.0 శాతం లోపే వచ్చాయి. ఈ స్థితిలో ఏపీలో వైసీపీ తిరుగులేని స్థితిలో ఉన్నట్టే. కానీ, అర్థంతరంగా 60 మందికి పైగా ఎమ్మెల్యేలను ఎందుకు మార్చారో రాజకీయ వర్గాలకు అర్థంకాలేదు. ఇంత మంచి పని చేసినా.. జనంలో తన ఎమ్మెల్యేలపై ఎందుకు విముఖత ఏర్పడిందో ముందుగానే వైసీపీ పసి గట్టలేదు. పనితీరులో లోపాన్ని పసిగట్టి వెంటనే చర్యలు తీసుకుని ఉంటే. ఇప్పుడు కొత్త అభ్యర్థులకు జనం ఆమోదం లభించేది అని రాజకీయ వర్గాల అభిప్రాయం.

ఉమ్మడి సేన ఉక్కిరి బిక్కిరి

- Advertisement -

టీడీపీ, జనసేన ఇప్పటికే జతకట్టాయి. ఇక త్వరలోనే బీజేపీతో కలిసి నడుస్తాయి. ఇక్కడే టీడీపీకి, జనసేనకు తలపోటు పెరిగింది. పొత్తుల్లో సీట్లు త్యాగం చేయాలి. ఎవరి సీట్లు ఎవరు త్యాగం చేస్తారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేనాని పవన్ కళ్యాణ్ తమ పార్టీ కేడర్‌ను సముదాయిస్తున్నారు. సీట్ల సర్దుబాటుతో కొన్ని త్యాగాలు అనివార్యమని చెబుతున్నాయి. ఈ సారి అధికారం తమదేనని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రంగంలోకి దిగింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభిమానులు ప్రత్యామ్నాయం లేక వైసీపీకి ఓటు వేశారని, ఈ సారి వైసీపీ కంచుకోట పగిలిపోతుందని ఉమ్మడి సేన అంచనా. దీనికి తోడు సిక్స్ గ్యారెంటీలతో ప్రజలను ఆకట్టుకొంటున్నారు. మరీ ముఖ్యంగా నిరుద్యోగ సమస్య.. ఈ ఐదేళ్లల్లో వలంటీర్ వ్యవస్థ, గ్రామసచివాలయ వ్యవస్థతో లక్షలాది మందికి ఉపాధి లభించింది. కానీ యువతలో ఒకటే కోరిక.. ప్రభుత్వ ఉద్యోగం. ఈ ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని టీడీపీ, జనసేన ఉవ్విళ్లూరుతున్నాయి. ఏది ఏమైనా… ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మళ్లీ గెలుస్తాం అని పైకి చెబుతూనే… ఒక వేళ ఓడిపోతే… ఏంటీ స్థితి? అనే ఆలోచనతో… పత్యర్థులను ఓడించటమే లక్ష్యంగా బరిలోకి రాకముందే కదం తొక్కుతున్నాయంటే .. ఆశ్చర్యపోనక్కరలేదు.

ఎటూ తేల్చుకోలేని బీజేపీ..

కాగా, జనసేన, తెలుగుదేశం పార్టీతో మైత్రీ విషయంలో బీజేపీ ఇంకా ఎటూ తేల్చుకోలేదు. ఈ రెండు పార్టీలతో పొత్తు ఉంటుందా? లేదా అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు బీజేపీ పెద్ద‌ల‌తో మంత‌నాలు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ఈ మ‌ధ్య చంద్ర‌బాబు ఢిల్లీ వెళ్లి ఆ పార్టీ పెద్ద‌లు అమిత్‌షాతోపాటు ప‌లువురుని క‌లిసి వ‌చ్చారు. దీంతో ఈ రెండు పార్టీల మ‌ధ్య పొత్త ఉంటుంద‌నే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. కానీ, దీనిపై హైక‌మాండ్ మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు.

ప్ర‌చారంలో అధినాయ‌కులు

ఏపీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ముంచుకొస్తున్న త‌రుణంలో పార్టీల అధినాయ‌కులు ప్ర‌చారంలో మునిగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జ‌గ‌న్‌, తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు, ఆ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శ లోకేశ్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, పార్టీ కార్య‌ద‌ర్శి నాగ‌బాబు ప్ర‌చారం మొద‌లెట్టారు. ప‌లు చోట్ల స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌లను త‌మ‌వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఒక‌రిపై మ‌రొక‌రు దుమ్మెత్తి పోసుకోవ‌డం కామ‌న్‌గా మారిపోయింది. ప‌లు ప‌థ‌కాలు, ఊర‌డింపులు, తాయిలాను ఓట‌ర్ల‌కు ఎర‌వేస్తూ ప్ర‌చారంలో కొత్త పుంత‌లు తొక్కిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement