Wednesday, May 1, 2024

టాస్క్ ఫోర్స్ దాడిలో 127 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. 15మంది అరెస్టు

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి ) : తిరుపతి జిల్లా పరిధిలో టాస్క్ ఫోర్సు చేపట్టిన దాడుల్లో మూడు ప్రాంతాల్లో 127ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 15మంది స్మగ్లర్లను అరెస్టు చేసి, వీరి నుంచి 6ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్సు ఎస్పీ కే.చక్రవర్తి తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు కర్నూలు రేంజి డీఐజీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం నుంచి కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టారు. శ్రీకాళహస్తి రేంజ్ రాగిగుంట సెక్షన్ ఎస్.రామాపురం రిజర్వాయరు సమీపంలో కొంత మంది ఎర్రచందనం దుంగలు మోసుకుని వస్తూ కనిపించారని తెలిపారు. టాస్క్ ఫోర్సు పోలీసులను చూసి దుంగలు పడేసి పారిపోయే ప్రయత్నం చేశారని, అయితే 8మందిని పట్టుకోగలిగినట్లు తెలిపారు.

- Advertisement -

వీరి నుంచి 74ఎర్రచందనం దుంగలు, మూడు మోటారుసైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కీలక వ్యక్తి అయిన బోడుగు రాజారావును విచారించగా, చెన్నైలోని మురుగన్ అనే వ్యక్తి ఎర్రచందనం దుంగలు కోరినట్లు తెలిపారు. ఆయనకు ఈ దుంగలను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. రామాపురం గ్రామానికి చెందిన రాజారావు(52)తో పాటు శ్రీకాళహస్తి మండలానికి చెందిన టీ.హరి (32), కే.చంద్రశేఖర్ (34), డీ.హరికృష్ణ(32), నారాయణవనంకు చెందిన కే.లోకయ్య (33), పిచ్చాటూరు మండలంకు చెందిన మహ్మద్ ఖాదిర్ (26), అరంబాకం వెంకటేష్ (52)లను అరెస్టు చేశారు.

ఇందులో పారెస్టు వాచర్ తిరుపాల్ హస్తం ఉండగా అతను పారిపోయాడు. మరో సంఘటనలో కృష్ణాపురం బీట్ ఏర్పేడు అటవీ ప్రాంతంలో చిందేపల్లి తాటిచెట్లు సమీపంలో కొంత మంది నిలుచుకుని ఉండగా గమనించారు. వారిని సమీపించడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. వారిలో ఇద్దరిని పట్టుకున్నారు. వీరిని నాగలాపురంకు చెందిన దొరైరాజ్ ప్రభు (34), కరకంబాడికి చెందిన వేముల నారాయణ (48)లుగా గుర్తించారు. వీరి నుంచి 28ఎర్రచందనం దుంగలు, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. మూడవ కేసులో కేవీబీపురం వెళ్లు మార్గంలో ఎస్ఎల్ పురం గ్రామం వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా, మోటారు సైకిళ్లపై కొంత మంది అక్కడ గుమి కూడి ఉన్నారు.

వీరిని సమీపంచడంతో పారిపోయే ప్రయత్నం చేశారు. వీరి సమీపంలో దాచి ఉంచిన 25ఎర్రచందనం దుంగలతో పాటు రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పిచ్చాటూరు మండలానికి చెందిన షరీఫ్ (29), బీ.అనిల్ (24), కేవీబీపరంకు చెందిన వి.ప్రేమ్ కుమార్ (26), వి.శివకుమార్ (22), రామచంద్రాపురం మండలం మద్దేరి తులసిరామ్ (32)లను అరెస్టు చేశారు. మొత్తం 127ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ రూ.కోటి ఉండవచ్చునని ఎస్పీ చక్రవర్తి తెలిపారు. 15మంది స్మగ్లర్లను అరెస్ట చేశామని, వీరి నుంచి 06ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులను టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్లో నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement