Friday, May 17, 2024

TS: మోదీ, అమిత్ షా నాపై పగబట్టారు… సీఎం రేవంత్

రిజ‌ర్వేష‌న్ల‌పై నిల‌దీస్తే పోలీసుల‌ను పంపారు
ఈడీ, ఐటి, సిబిఐలు పోయి ఇప్ప‌డు పోలీసులు వ‌చ్చేశారు
దేనికి భ‌య‌ప‌డేది లేదు..
తెలంగాణాలో బీజేపీకి ఒక్క సీటు కూడా రానివ్వం

కోరుట్ల: లోక్ స‌భ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి దేశాన్ని అమ్మేయాలని బీజేపీ చూస్తుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ…. “రిజర్వేషన్ల రద్దుపై తాను ప్రశ్నించ‌డంతో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా త‌న‌పై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టించార‌న్నారు.. ఈడీ, ఐటీ, సీబీఐతోనే కాదు.. ఢిల్లీ పోలీసులతోనూ భయపెట్టాలని చూస్తున్నార‌న్నారు.. తాను ఇటువంటి కేసులకు భ‌య‌ప‌డేది లేద‌న్నారు.. మీ దగ్గర సీబీఐ ఈడీ, పోలీసులు ఉండొచ్చు. నావెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారంటూ మోడీ, అమిత్ షాల‌ను రేవంత్ హెచ్చ‌రించారు.

బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య చీక‌టి ఒప్పందం…
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, దాన్ని నిన్న జరిగిన ఖమ్మం సభలో కేసీఆర్‌ బయటపెట్టారన్నారు. తెలంగాణలో 10 నుంచి 12 ఎంపీ స్థానాలను బీఆర్‌ఎస్‌కు ఇస్తే కేంద్రంలో హంగ్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని.. నామా నాగేశ్వర్‌రావు మంత్రి అవుతారని చెప్పారంటే బీఆర్‌ఎస్‌, బీజేపీల మధ్య జరిగిన చీకటి ఒప్పందం బహిర్గతమైందన్నారు. కేంద్రంలోని నరేంద్రమోడీ 400ఎంపీ స్థానాలను ఇస్తే మూడోసారి ప్రధాన మంత్రి అయి రిజర్వేషన్లను రద్దుచేస్తానని బీజేపీ ప్రకటిస్తోందన్నారు. 1978లోనే ఆనాడు కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తుచేశారు.

1990లో బీసీ మండల్‌ ఆధ్వర్యంలో కమిషన్‌ వేస్తే బీసీలు 52 శాతం ఉన్నారని వారికి 27 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సూచిస్తే మండల్‌కు వ్యతిరేకంగా ఆనాడు బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ రథయాత్ర నిర్వహించి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమించారని అన్నారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళితే బీసీ జనాభాను ఒప్పించండి.. జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 52 శాతం రిజర్వేషన్లు పెంచుకోవచ్చని, అది జరగాలంటే ముందుగా బీసీ జనగణన జరగాలని సుప్రీంకోర్డు ఆదేశించిందని రేవంత్ గుర్తు చేశారు. ఆరోజు నుంచి ఈరోజు వరకు కూడా బీసీ గణన జరగలేదని, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ముందుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు బీసీ గణన జరిపించాలని, జనాభా ప్రాతిపదికన నిధులు ఇస్తామని చెప్పడం జరిగిందని అన్నారు.

- Advertisement -

అమిత్‌షాకు కేసీఆర్‌ ఆత్మ ఆవరించింది…
తెలంగాణలో కేసీఆర్‌ తనను చర్లపల్లి జైలుకు పంపార‌ని, అయినా భయపడలేదని, బెయిల్‌ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీని బండకేసి కొట్టడం జరిగిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కేంద్రహోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్‌షాకు కేసీఆర్‌ ఆత్మ ఆవరించిందన్నారు. బీజేపీ రిజర్వేషన్లను రద్దుచేస్తామని ప్రకటించిన నేపథ్యంలో గల్లి నుంచి ఢిల్లీ వరకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం మొదలు పెట్టగానే ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ భవన్‌కు అమిత్‌షా పోలీసులను పంపిచార‌న్నారు. పోలీసులే కాదు.. మిలటరీని పంపినా భయ పడేదిలేదన్నారు. గుజరాత్‌ పెత్తందారులు, ఢిల్లీ నవాబులకు భయపడేది లేదని, గుజరాత్‌ అహంకారమా.. తెలంగాణ పౌరుషమా… బిడ్డా రా… తెలంగాణలో తేల్చుకుందాం. తెలంగాణలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలువకుండా చేస్తానని రేవంత్ బీజేపీకి సవాల్‌ విసిరారు.

ప్రధాని నరేంద్రమోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా కలిసి రిజర్వేషన్లను తొలగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవడానికి సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితిలు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో పాటు కలిసి వస్తున్నాయని అన్నారు. తెలంగాణలో బీజేపీకి ఒక్కసీటు రాకుండా గట్టీగా పోరాడి ఓడించాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement