మాడు పగిలే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ, రేపు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఓ వైపు భానుడి సెగలతో పట్టపగలే చుక్కలు చూస్తోన్న జనానికి ఈ వర్ష సూచన వార్తను కాస్త ఉపశమనంగా ఫీలవుతున్నారు.
అయితే అదే సందర్భంలో వర్షం పడే అవకాశాలున్నాయన్న వార్తలు రైతన్నలను కలవరపెడతున్నాయి. ఇప్పటికే సీజన్లో పండే మామిడి పంట చేతికొచ్చే సమయంలో వానలు పడతాయని అధికారులు చెప్పడంతో రైతులు కంగారు పడుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఓ రేంజ్లో దంచికొడుతున్నాయి. తెల్లవారుజామునే భానుడు సెగలు కక్కుతున్నాడు. ఉదయం ఎనిమిది గంటల తర్వాత బయటికి రావాలంటేనే జనాలు జంకుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశముందని తెలిపింది.