Saturday, July 27, 2024

రేవంత్‌కు పీసీసీ ఇస్తే.. జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి?

తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారాలని భావిస్తున్నారా? పీసీసీ పదవి దక్కకపోతే జగ్గారెడ్డి ఏం చేయబోతున్నారు? అనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పేరు ప్రకటిస్తే… జగ్గారెడ్డి టిఆర్ఎస్‌లో చేరాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీసీసీ రేసులో రేవంత్ రెడ్డిని జగ్గారెడ్డి తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పుడు రేవంత్‌ను పీసీసీ చీఫ్‌గా చేస్తారని పార్టీ అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో దీనికి నిరసనగా జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పుకోవాలని యోచిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ లో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల మంత్రి హరీష్ రావు పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సంగారెడ్డికి వచ్చినప్పుడు, జగ్గారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అంతేకాదు ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీని, హరీష్ రావుపై విమర్శలు చేసే జగ్గారెడ్డి… అనుహ్యంగా ఆయనపై ప్రశంసల జల్లు కురిపించడం సర్వత్ర చర్చనీయాంశమైంది. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా చేస్తే తాను కాంగ్రెస్ నుంచి తప్పుకుంటానని చెప్పేందుకు జగ్గారెడ్డి ఈ విధంగా వ్యవహరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

జగ్గారెడ్డి తన సన్నిహితలు, అనుచరులతో కాంగ్రెస్‌ను విడిచిపెట్టే అంశంపై ఇప్పటికే చర్చించారని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎకైక ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి ఉన్నారు. జగ్గారెడ్డి తన రాజకీయ జీవితాన్ని బీజేపీతో ప్రారంభించారు. అలె నరేంద్రకు ప్రధాన అనుచరుడగా ఉన్నారు. తరువాత, ఆయన, విజయశాంతి కలిసి తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం జరిగిన పరిణామాలలో ఇద్దరూ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం విజయశాంతి బీజేపీలో కొనసాగుతుండగా… జగ్గారెడ్డి మాత్రం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఒక వేళ జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరితే తెలంగాణ రాజకీయాలు మరో మలుపు తిరగడం ఖాయం.

Advertisement

తాజా వార్తలు

Advertisement