తొలి మ్యాచ్ లో ఆర్సీబీ విజయం..

ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 2 వికెట్ల తేడాతో నెగ్గింది. 160 పరుగుల లక్ష్యాన్ని చివరిబంతికి ఛేదించింది. బెంగళూరు జట్టులో విధ్వంసక వీరుడు ఏబీ డివిలియర్స్ 48 పరుగులు చేశాడు. గ్లెన్ మ్యాక్స్ వెల్ 39, కెప్టెన్ విరాట్ కోహ్లీ 33 పరుగులు సాధించారు.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. అయితే, కీలక బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ముంబయి ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 159 పరుగులు మాత్రమే చేసింది. క్రిస్ లిన్ 49 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ 31, ఇషాన్ కిషన్ 28 పరుగులు చేశారు. రోహిత్ శర్మ (19), హార్దిక్ పాండ్య (13), పొలార్డ్ (7) నిరాశపరిచారు. బెంగళూరు బౌలర్లలో మీడియం పేసర్ హర్షల్ పటేల్ 5 వికెట్లు తీయడం హైలైట్. జేమీసన్, సుందర్ చెరో వికెట్ తీశారు.