Saturday, June 1, 2024

Cyclone Remal: తీరాన్ని తాక‌క‌ముందే రెమాల్ బీభ‌త్సం

ప‌శ్చిమ బెంగాల్ ఎడ‌తెగ‌ని వాన‌లు
తీరం వెంబ‌డి 100 కిలో మీట‌ర్ల వేగంతో ఈదురు గాలులు
చిగుర‌టాకుల వ‌ణ‌కుతున్న బెంగాల్ ప్ర‌జ‌లు
హై అల‌ర్ట్ ప్ర‌కటించిన కేంద్రం
రంగంలోకి ఎన్డీఆర్ ఎప్ బృఃదాలు
ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్న అధికారులు
తుపాన్ స‌హాయ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్న సిఎం మ‌మ‌తా

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. దీని ప్రభావంతో అతి భారీ వర్షాలు కురుస్తోన్నాయి. కోల్‌కత సహా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షం పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బలమైన ఈదురుగాలులు దీనికి తోడయ్యాయి. బంగాళాఖాతం నైరుతి, పశ్చిమ- మధ్య ప్రాంతంలో ఈ నెల 23వ తేదీన ఏర్పడిన అల్పపీడనం బలపడింది.

ఈ తీవ్ర వాయుగుండం శనివారం రాత్రి తుపానుగా బలపడింది. దీనికి ‘రెమాల్‌’ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్‌కు దక్షిణ ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు ఉదయానికి ఇది తీవ్ర తుపానుగా మారింది. ఆదివారం అర్థరాత్రికి బంగ్లాదేశ్ లోని ఖెపుపరా, సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంగా గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.

- Advertisement -

ఈ తుఫాన్ ఈ ఆదివారం మధ్యాహ్నానికి మరింత ఉధృత రూపాన్ని సంతరించుకుందని కోల్‌కతలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. జగత్‌సింగ్‌పుర, కేంద్రపారా, భద్రక్, బాలాసోర్, మయూర్‌భంజ్, జాజ్‌పూర్.. వంటి జిల్లాలపై తుఫాన్ ప్రభావం పడింది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణా, ఉత్తర 24 పరగణా, సౌత్ మేదినిపూర్, నార్త్ మేదినిపూర్, హౌరా, హుగ్లీ జిల్లాలు సహా కోల్‌‌కతలో ఏకధాటిగా వర్షాలు ముంచెత్తుతున్నాయి. ప‌శ్చిమ బెంగాల్ లో స‌హాయ కార్య‌క్ర‌మాల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.. లోత‌ట్టు, తీర ప్రాంతం ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారు.. స‌హాయ పున‌రావాస కార్య‌క్ర‌మాల‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మ‌మ‌తా బెనర్జీ స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు..

ఇది ఇలా ఉంటే ఈ ఉదయం 8:30 గంటల సమయానికి రెమాల్ తుఫాన్.. బంగ్లాదేశ్‌లోని ఖేపురారకు నైరుతి దిశగా బంగాళాఖాతంలో 260, మోంగ్లాకు 310, పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్‌కు 240, కెన్నింగ్ ప్రాంతానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కనిపించింది. గంటకు ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది.

ఈ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ బలమైన ఈదురుగాలులు వణికిస్తోన్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా మారింది. ముందుజాగ్రత్త చర్యగా మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు అధికారులు. జాతీయ, రాష్ట్రీయ విపత్తు నిర్వహణ బలగాలను మోహరింపజేశారు. తీర ప్రాంతాలను మూసివేశారు. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు ఇచ్చారు. ఈ రాత్రి లేదా అర్ధరాత్రి దాటిన తరువాత ఈ తుఫాన్ తీరాన్ని తాకే అవకాశం ఉంది.

తుపానుగా బలపడిన వాయుగుండం ఈ పరిణామాలపై కేంద్రం ఆరా తీస్తోంది. ఎప్పటికప్పుడు తుఫాన్ ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. తుఫాన్‌ కదలికలు, తీరం దాటే సమయంలో, ఆ తరువాతా సంభవించే పరిణామాలపై సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటోంది. ప్రాణనష్టాన్ని నివారించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలను సూచించింది. కేంద్ర ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు.. స్పందించారు. రెమాల్ తుఫాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్స్, బంగ్లాదేశ్‌లోని ఖేపురార, మోగా మధ్య తీరాన్ని దాటుతుందని వెల్లడించారు. ఆ సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తోన్నాయని తెలిపారు.


ఇక తుఫాను కారణంగా, మే 26-27 తేదీలలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాలోని కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. అలాగే, మే 27-28 తేదీలలో ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను కారణంగా సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు మే 27వ తేదీ వరకు బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని, తీరానికి తిరిగి రావాలని అధికారులు సూచించారు.

తుఫాను పేరు…
హిందూ మహాసముద్ర ప్రాంతంలో తుఫానులకు పేరు పెట్టే ప్రక్రియ కారణంగా ఈ తుఫానుకు పేరు పెట్టారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతంతో సహా ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడే తుఫానులకు పేరు పెట్టే సంప్రదాయాన్ని అనుసరించి తుఫానుకు ‘రెమల్’ అని పేరు పెట్టారు. ఈ సంప్రదాయం ప్రకారం దీని పేరు కూడా ఉంచబడింది. ‘రెమల్’ అనే పేరును ఒమన్ సూచించింది. దీని అర్థం అరబిక్‌లో ‘ఇసుక’.

తుపాను వల్ల ఎంత నష్టం వాటిల్లుతుంది?
తుఫాను దానితో పాటు బలమైన గాలులు, భారీ వర్షాలు తెస్తుంది. దీని వల్ల భారీగా నష్టపోయే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ , ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో విద్యుత్, కమ్యూనికేషన్ లైన్‌లు (మొబైల్ టవర్లు), చదును చేయని రోడ్లు, పంటలు , తోటలకు భారీ నష్టం వాటిల్లుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్చా ఇళ్లలో నివసించే ప్రజలు అలాంటి స్థలాలను ఖాళీ చేసి సురక్షితమైన ఇండోర్ ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు.

ఎపిలోని కళ్యాణదుర్గంలో అత్యధికంగా..

ఏపీ సహా త్రిపుర, మిజోరం, మణిపుర్, నాగాలాండ్, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మేఘాలయ, అండమాన్, నికోబార్‌ దీవుల ప్రభుత్వాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అప్రమత్తం చేసింది. గుంటూరు, కృష్ణా, అనంతపురం, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లాలోని . కళ్యాణదుర్గం మండలంలో 86.4 మిల్లీమీటర్లు, కణేకల్లులో 70 మిల్లీమీటర్లు, ఉరవకొండలో 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మడకశిర, తాడిమర్రి మండలాల్లో అరటి, దానిమ్మ దెబ్బతిన్నాయి. ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement