Saturday, July 27, 2024

న్యూఢిల్లీ : చిన్న కరెన్సీ నోట్లకూ నకిలీ మకిలి

  • ఆంధ్రప్రభ దినపత్రిక పేజ్ వన్ స్పెషల్ స్టోరీ
  • పెద్దనోట్ల చలామణి తగ్గడంతో చిన్న నోట్లపై దృష్టి
  • రూటు మార్చిన నకిలీనోట్ల ముద్రణ దారులు
  • 200, 100, 50 చివరికి 20 నోట్లకూ నకిలీ బెడద
  • సునాయాసంగా మార్చేస్తున్న వైనం
  • నకిలీనోట్ల గుర్తింపుపై బ్యాంకర్లకు ఆర్బీఐ తర్ఫీదు
  • సామాన్యులకూ అవగాహన కల్పిస్తేనే మంచి ఫలితాలు
  • నిర్లక్ష్యం చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం
  • ప్రభుత్వాలకు నిపుణుల సూచనలు

నకిలీ కరెన్సీ కేవలం ఒక నోటుకు సంబంధించింది కాదు. ఇది మొత్తం దేశ భద్రతకు, భవిష్యత్‌కు సంబంధించిన అంశం. నకిలీ నోట్లను నిరోధించలేని పక్షంలో ఆర్ధికవ్యవస్థ అతలాకుతలమౌతుంది. ద్రవ్యోల్బణం అనూహ్యంగా పెరుగుతుంది. బ్లాక్‌ మనీ పెరుగుతుంది… ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్ధికఊతం లభిస్తుంది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని నకిలీ కరెన్సీని పూర్తిస్థాయిలో నిర్మూలించాల్సిన ఆవశ్యకతను నిపుణులు వెల్లడిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా రూ. 200, రూ. 100, రూ. 50 విలువ కలిగిన కరెన్సీ నోట్లలో నకిలీవి పెద్దెత్తున చలామణి అవుతున్నాయి. ఆఖరకు 20రూపాయల నోట్లలో కూడా నకిలీవి వచ్చేశాయి. 2016నవంబర్‌ 8న ప్రధాన మోడి అంతవరకు చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500నోట్లను ఆకస్మాత్తుగా రద్దు చేశారు. అనంతరం రూ. 2000 నోటును ప్రవేశపెట్టారు. కొంతకాలం తర్వాత కొత్త డిజైన్‌తో రూ. 500నోటును మార్కెట్‌లోకి తెచ్చారు. కాగా వచ్చీరావడంతోనే 2000వ కలిగిన కరెన్సీ నోటుకు నకిలీలు దిగిపోయాయి. ఎక్కడ చూసినా నకిలీ 2000 నోట్లు పట్టుబడ్డాయి. దీంతో 2019లో 2వేల నోట్ల ముద్రణ నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కొత్తగా రూ. 200 విలువకలిగిన నోట్లను ప్రవేశపెట్టింది. మరోవైపు రూ. 500విలువ గల నోట్ల చలామణి కొనసాగుతోంది. ఎక్కువ విలువ కలిగిన 2వేల నోట్ల చలామణి మార్కెట్‌లో తగ్గిపోయింది. రిజర్వ్‌బ్యాంక్‌ కూడా తన వద్దకొచ్చిన నోట్లను తిరిగి మార్కెట్‌లోకి ప్రవేశపెట్టడం మానేసింది. దీంతో నకిలీ నోట్ల తయారీదారులు కొంతకాలం ఐదొందల నోట్లపై దృష్టి పెట్టారు. అయితే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అతిపెద్ద విలువ కలిగిన నోటు అదే కావడంతో ప్రతి ఒక్కరు రూ. 500నోటుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. వ్యాపారులు, వినియోగదార్లు, సాధారణ వ్యక్తులకు కూడా దీనిపై అవగాహన పెరిగింది. దీంతో నకిలీ నోట్ల ముద్రణదార్లు రూటుమార్చారు. రూ. 200, రూ. 100, రూ 50ల విలువ కలిగిన నకిలీ నోట్లు ముద్రించి మార్కెట్‌లోకి విస్తృతంగా ప్రవేశపెట్టినట్లు రిజర్వ్‌బ్యాంక్‌ గుర్తించింది. గతవారం రిజర్వ్‌బ్యాంక్‌ ఆర్దిక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్దంగా చలామణిలో ఉన్న నకిలీ నోట్లపై అధ్యయనాన్ని చేపట్టింది. అలాగే నకిలీ నోట్ల గుర్తింపు ప్ర్రక్రియపై బ్యాంక్‌ ఖాతాదార్లు, వినియోగదార్లు, సాధారణ వ్యాపారులకు అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించింది. 2019-20సంవత్సరంతో పోలిస్తే తదుపరి ఏడాది వివిధ మార్గాల్లో స్వాధీనం చేసుకున్న రూ. 200 విలువ కలిగిన నకిలీ కరెన్సీ నోట్ల సంఖ్యలో ఏకంగా 131శాతం పెరిగింది. అలాగే వంద రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్ల సంఖ్యలో 37శాతం, 50రూపాయల నకిలీ నోట్లలో 26శాతం పెరుగుదల నమోదైంది. ఇక 20రూపాయల విలువ కలిగిన నోట్లలో కూడా భారీగానే నకిలీలున్నట్లు ప్రాధమికంగా రిజర్వ్‌బ్యాంక్‌ గుర్తించింది. సహజంగా చిల్లర మారకంలో ఈ 200, 100,50నోట్లు సునాయాశంగా మారిపోతుంటాయి. ఇందులో కూడా నకిలీలొస్తాయని ఎవరూ ఊహించరు. దీన్నే నకిలీ నోట్ల తయారీదార్లు తమకనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు పాకిస్థాన్‌లో ముద్రించి బంగ్లాదేశ్‌ మీదుగా వెయ్యి రూపాయల నోట్లను భారత్‌లోకి పంపేవారు. దీన్ని నిలువరించేందుకు నోట్ల రద్దు ఉపయోగపడింది. ఆ త ర్వాత ఇదే మార్గంలో రూ. 2వేల నోటు తయారు చేశాయి. వీటి మారకాన్ని నియంత్రించడంతో ఇప్పుడు చిన్న మారకపు విలువ కలిగిన కరెన్సీ నోట్లపై వీరు దృష్టిపెట్టారు. దేశవ్యాప్తంగా రిజర్వ్‌బ్యాంక్‌ నిర్వహించిన ఆర్ధిక అవగాహనా కార్యక్రమాల్లో బ్యాంకుల ఖాతాదార్లు, వ్యాపారులు, రోజూ ఆర్ధిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులకు నకిలీ నోట్ల గుర్తింపుపై తర్ఫీదునిచ్చారు. దీన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలి. మహిళలు, విద్యార్ధులు, సాధారణ వ్యక్తులకు కూడా నకిలీ నోట్ల గుర్తింపు ప్రక్రియలో మెళకువలు నేర్పాలి. 15రకాల గుర్తుల ఆధారంగా నకిలీల్ని కనిపెట్టొచ్చని బ్యాంకింగ్‌ ఉన్నతాధికార్లు ఈ అవగాహన కార్యకలాపాల్లో స్పష్టం చేశారు. అయితే ఇవన్నీ విద్యాధికులు, ఆర్ధిక కార్యకలాపాల నిర్వహణలో సామర్ద్యమున్న వారికే అవగాహనుంటుంది. సాధారణ వ్యక్తులకు కూడా అర్ధమయ్యే రీతిలో ఈ అవగాహనా కార్యక్రమాల్ని నిర్వహిస్తే నకిలీలను గుర్తించి నిలువరించడంలో మరింత మెరుగైన ఫలితాలొస్తాయని నిపుణులు సూచిస్తున్నారు.
నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ, పంపిణీ భారత ఆర్ధిక వ్యవస్థ వెనుముఖను విచ్చిన్నం చేసే ప్రమాదముంది. ఇది పౌరులకు కూడాతీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ముద్రణ, పంపిణీదార్లకు మరణశిక్షను నిర్ధాక్షిణ్యంగా అమలు చేయాలన్న డిమాండ్‌ దీర్ఘకాలంగా ఉంది. ఒకప్పుడు నేపాల్‌ మీదుగా పాకిస్థాన్‌ ముద్రిత నకిలీ కరెన్సీ భారత్‌లోకి చేరేది. గతేడాది జాతీయ దర్యాప్తు సంస్థ సూచనల మేరకు నేపాల్‌ పోలీసులు నకిలీ కరెన్సీ నోట్ల రాకెట్‌కింగ్‌ పిన్‌యూనస్‌ అన్సారీని అరెస్టు చేశారు. దీంతో ఐఎస్‌ఐ, డి కంపెనీలు తిరిగి భారత ఆర్ధిక వ్యవస్థలోకి నకిలీ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే లక్ష్యాన్ని ఎంచుకున్న వైనం బహిర్గతమైంది. నకిలీ నోట్ల రాకెట్‌లో ఐఎస్‌ఐ కీలకపాత్ర ధారిగా ఉంది. అలాగే అంతర్జాతీయ మాఫియా డాన్‌గా ఎదిగిన దావుద్‌ ఇబ్రహీంతో అన్సారీకి సన్నిహిత సంబంధాలున్నాయి. అన్సారీతో పాటు మహ్మద్‌ అక్తర్‌, నాడియా అన్వర్‌, నసిరుద్దీన్‌ అనే ముగ్గురు పాక్‌ పౌరులను కూడా నేపాల్‌ పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో 2016 నవంబర్‌ 8 పెద్దనోట్ల రద్దు ప్రక్రియ అనంతరం కొంతకాలం స్థబ్దతగా ఉన్న నకిలీ భారత కరెన్సీ ముద్రణదార్లు తిరిగి కార్యకలాపాల్ని వేగం పెంచిన వైనం వెల్లడైంది. అయితే నేపాల్‌లో రాజకీయ మార్పులు, చోటు చేసుకోవడంతో పాటు నేపాల్‌ పోలీసులు భారత నిఘా వర్గాలకు సహకరిస్తుండడంతో పాక్‌ తన రూటు మార్చింది. నేపాల్‌ మీదుగా నిర్వహించిన పంపిణీని నిలిపేసింది. అందుకు బదులు బంగ్లాదేశ్‌ మీదుగా పంపిణీ మొదలెట్టింది. మోహన్‌భాయ్‌ దేవాదియా అనే నకిలీ కరెన్సీ రాకెట్‌ సరఫరా దారుని ఉగ్రవాద నిరోధక దళం అదుపులోకి తీసుకోవడంతో భారత్‌లో ఉగ్రదాడులకు ఈ నకిలీ కరెన్సీని వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement