Manika Batra | కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌.. తొలి భారత మహిళగా రికార్డు

భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మనిక బాత్రా కెరీర్‌ అత్యుత్తమ ర్యాంక్‌ సాధించింది. ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ (ఐటీటీఎఫ్‌) మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో మనిక బత్రా ఏకంగా 15 స్థానాలు ఎగబాకి కెరీర్‌ బెస్ట్‌ 24వ ర్యాంక్‌ కైవసం చేసుకుంది.

దీంతో ఐటీటీఎఫ్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో టాప్‌-25లోకి ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా బాత్రా కొత్త రికార్డు నమోదు చేసింది. అంతకుముందు 2019లో సత్యన్‌ జ్ఞానేశ్వరన్‌ పురుషుల విభాగం సింగిల్స్‌లో 24వ ర్యాంక్‌ సాధించాడు. భారత్‌ తరఫును మహిళా, పురుషుల విభాగంలో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌. కామన్వెల్త్‌ గేమ్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మనిక బాత్రా ఈ ఏడాది అద్భుత ప్రదర్శలతో ఆకట్టుకోంటుంది.

ఇటీవల ముగిసన సౌదీ స్మాష్‌ టీటీ టోర్నీలో మనిక ప్రపంచ రెండో ర్యాంకర్‌, ఒలింపిక్‌ మెడలిస్ట్‌ వాంగ్‌ మన్యు (చైనా)పై సంచలన విజయం సాధించింది. అదే టోర్నీలో 14వ ర్యాంకర్‌ నీనా మిట్టెల్‌హామ్‌ను ఓడించి ఇటీవల కోల్పోయిన భారత నెంబర్‌-1 ర్యాంక్‌ను మళ్లి సొంతం చేసుకుంది.ఇక ఐటీటీఎఫ్‌ తాజా ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మూడు స్థానాలు కోల్పోయి 41వ ర్యాంక్‌లో నిలిచింది.

పురుషుల విభాగం సింగిల్స్‌లో భారత స్టార్‌ ఆచంట శరత్‌ కమాల్‌ 40వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. మహిళల డబుల్స్‌లో సుతీర్థ ముఖర్జీ-ఐహికా ముఖర్జీ సిస్టర్స్‌ జోడీ 13వ ర్యాంక్‌కు ఎగబాకారు. అదే మెన్స్‌ డబుల్స్‌లో మానవ్‌ ఠక్కర్‌-మానుష్‌ షా జంట మూడు స్థానాలు దిగజరారి 15వ ర్యాంక్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో మనిక బాత్రా-సత్యన్‌ జోడీ 24వ ర్యాంక్‌లో నిలిచింది.

Advertisement
Advertisement
Exit mobile version