Delhi | ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలి.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ డిమాండ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్దత కల్పించాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో బుధవారం మాదిగ ఉద్యోగుల సంఘం, మాదిట జర్నలిస్ట్ ఫోరం, కర్ణాటక ఎమ్మార్పీఎస్ నాయకులు, మాదిగ లాయర్ ఫెడరేషన్, ఇతర సంఘాల ఆధ్వర్యంలో మహా ధర్ నిర్వహించారు.

పలువురు ఎంపీలు నిరసన ప్రదర్శనలో పాల్గొని మద్దతు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ, మాదిగ ఉపకులాలు మూడు దశాబ్దాలుగా అలుపెరగని  పోరాటం  చేస్తున్నాయని కృష్ణ మాదిగ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్  పర్యటన సందర్భంగా వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారని ఆయన అన్నారు.

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణకు సహకరించాలని కోరారు. ధర్నాకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పోరాటం త్యాగాల మధ్య సుదీర్ఘంగా కొనసాగుతోందన్నారు. మాదిగల ఉద్యమం అంటే వ్యక్తిగతంగా తనకు అభిమానమని చెప్పారు. కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Exit mobile version