Friday, March 29, 2024

సీమ జిల్లాలపై వర్షప్రతాపం.. ఉద్యానపంటల ఉసురు తీసిన గాలివాన..

తిరుపతి, ప్రభన్యూస్‌బ్యూరో (రాయలసీమ) : గత నెలాఖరు వరకు చండ ప్రచండ భానుడు ప్రతాపాన్ని చవిచూపిన రాయలసీమ జిల్లాల్లో గత పదిరోజులుగా వాయుదేవుడితో వరుణదేవుడు కలిసి వీరవిహారం చేస్తున్నారు. రెండు విడతలుగా వీచిన పెనుగాలులకు తాజాగా అసని తుఫాను ప్రభావం తోడు కావడంతో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం గాలివాన కారణంగా దాదాపు 15 వేల హెక్టార్లలో అత్యధికంగా ఉద్యానపంటలు దెబ్బతిన్నట్టు ప్రాధమిక అంచనా ప్రకారం తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతానికి చెందిన నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధుల్లో గత నెలాఖరు వరకు నెలరోజుల పాటు వడగాడ్పులతో సగటున ప్రతిరోజు 40 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. ఈ నెల ఆరంభం నుంచి రెండు విడతలుగా వీచిన పెనుగాలులతో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అధికారిక సమాచారం ప్రకారం నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధుల్లో గురువారం వరకు దాదాపు వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కానీ వారంరోజులక్రితం గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వీచిన పెనుగాలులు ఉద్యానవన పంటల ఉసురుతీసింది. చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల పరిధుల్లో అరటి, మామిడి, చీని, బొప్పాయి, నిమ్మ తోటలకు తీవ్రనష్టం సంభవించింది. ఇక కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు, కొన్ని చోట్ల పసుపు వంటి వాణిజ్యపంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఆ గాలివానకు రెండురోజులక్రితం బంగాళా ఖాతంలో మొదలైన అసని తుఫాను ప్రభావం తోడైంది. అసని తుఫాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆయా ఉమ్మడి జిల్లాల అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం దాదాపు 15 వేల హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిని సుమారు రూ.15 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. పూర్తిస్ధాయిలో నష్టాల వివరాలను సేకరించడంలో సంబంధిత అధికారులు తలమునకలవుతున్నారు.

ఒకటి రెండురోజుల్లో సమగ్ర నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపుతామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా అసని తుఫాను రాష్ట్రంలో తీరం దాటిన నేపథ్యంలో గురువారం కడప, తిరుపతి, నంద్యాల, అన్నమయ్య జిల్లాల పరిధుల్లో సగటున ఐదారు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇతర జిల్లాల్లో కూడా ఒక మోస్తరు వర్షపాతం నమోదైంది. ఈ నెల మొదటివారంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో అత్యధికంగా 5 సెంటీమీటర్లు, ఉమ్మడి కడప జిల్లా పరిధిలో 8 సెంటీమీటర్లు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6 సెంటీమీటర్లు, ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 6 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. సహజంగానే పట్టణ ప్రాంతాల్లో పల్లపుప్రాంతాలు జలమయం కావడం, డ్రైనేజీ సమస్యలు పెరిగిపోవడం వంటి సమస్యలు పెరిగాయి. కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లాకు చెందిన సుళ్లూరుపేట, వెంకటగిరి, గూడూరు నియోజకవర్గ పరిధుల్లోని సముద్రతీర ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతోపాటు తక్షణ సహాయచర్యలకు అవసరమైన సిబ్బందిని సిద్దం చేసినట్టు సంబంధిత అధికారులు తెలిపారు.మొత్తంమీద గత పదిరోజులుగా విడతలవారీగా వీచిన పెనుగాలులకు తాజాగా వచ్చిన అసని తుఫాను ప్రభావం తోడు కావడంతో రాయలసీమ జిల్లాల్లో ఉద్యానపంటలకు పెనునష్టం సంభవించగా విస్తారంగా కురుస్తున్న వర్సాలు ప్రజలను వేసవితాపం నుంచి రక్షించేందుకు తోడ్పడుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement