Thursday, April 25, 2024

Delhi | వరుసగా రెండో రోజు ఈడీ ముందుకు సోమ భరత్.. ఆడిటర్ బుచ్చిబాబు కూడా..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మనీలాండరింగ్ అంశాన్ని దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఎదుట బుధవారం న్యాయవాది సోమ భరత్ కుమార్ హాజరయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తరఫున ప్రతినిధిగా మంగళవారం హాజరైన సోమ భరత్, వరుసగా రెండోరోజు కూడా హాజరయ్యారు. కవిత ఈడీకి సమర్పించిన 10 సెల్‌ఫోన్ల నుంచి విచారణకు అవసరమైన డేటాను మాత్రమే తీసుకుంటామని, ఇదంతా కవిత సమక్షంలో లేదా ఆమె ప్రతినిధి సమక్షంలోనే చేస్తామని ఈడీ అధికారులు మెయిల్ చేసినట్టు తెలిసింది.

ఈ క్రమంలో మంగళవారం కొన్ని ఫోన్లను అన్‌లాక్ చేసి, అందులో డేటాను సోమ భరత్ సమక్షంలో కాపీ చేసుకున్న ఈడీ సైబర్ నిపుణులు, బుధవారం మరికొన్ని ఫోన్లను తెరిచి డేటాను విశ్లేషించినట్టు తెలిసింది. ఫోన్ మెమరీ నుంచి డిలీట్ చేసిన ఫైళ్లను రికవరీ చేయడం కోసం సైబర్ ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్ ఉపయోగిస్తున్నట్టు తెలిసింది. ఒక్కొక్క ఫోన్ నుంచి పాత డేటాను రికవరీ చేయడానికి కొన్ని గంటల సమయం పడుతున్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. రికవరీ చేసిన డేటాలో విచారణకు పనికొచ్చే సమాచారాన్ని వేరుచేయడానికి కూడా ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలిసింది. ఈ పరిస్థితుల్లో బుధవారం ఈడీ కార్యాలయంలో మరింత ఎక్కువ సేపు భరత్ గడపాల్సి వచ్చింది.

పత్రాలు అందజేసిన బుచ్చిబాబు
ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు కూడా బుధవారం ఈడీ కార్యాలయం వద్ద కనిపించారు. మధ్యాహ్నం గం. 2.00 సమయంలో అక్కడికి చేరుకున్న ఆయన గంటన్నర తర్వాత బయటికొచ్చారు. ఈడీ కోరిన కొన్ని పత్రాలను అందజేసినట్టు తెలిసింది. విచారణలో కీలకంగా మారిన కొన్ని లావాదేవీలకు సంబంధించిన పత్రాలను ఈడీ కోరిందని, కవిత వ్యాపార వ్యవహారాల్లో ఆడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న బుచ్చిబాబును ఆ పత్రాలు తీసుకురావాల్సిందిగా ఈడీ అధికారులు ఆదేశించారని తెలిసింది.

- Advertisement -

ఢిల్లీ మద్యం పాలసీలో అక్రమాలు, అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో బెయిల్‌పై విడుదలైన బుచ్చిబాబును ఈడీ ఇప్పటికే పలుమార్లు పిలిచి ప్రశ్నించింది. బుధవారం విచారణ ఏదీ లేనప్పటికీ, కీలక డాక్యుమెంట్లను అందజేయడం కోసం పిలిచినట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. ఓవైపు కవిత సమర్పించిన సెల్ ఫోన్ల నుంచి సేకరించే సమాచారంతో పాటు బుచ్చిబాబు అందజేసే సమాచారం ఆధారంగా మరోసారి కవితను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఈ మేరకు త్వరలోనే సమన్లు చేయనున్నట్టు చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement