Thursday, April 18, 2024

పీఎం కేర్స్ నిధులతో దేశంలో 551 ఆక్సిజన్ ప్లాంట్లు

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్ కొరత వేధిస్తుండటంతో కొత్తగా 551 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం పీఎం కేర్స్ నిధులను వెచ్చించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) ఆదివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి మోదీ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 551 ప్రెజర్ స్వింగ్ అబ్సార్‌ప్షన్ మెడికల్ ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నిధులను ఖర్చు చేసేందుకు సూత్రప్రాయంగా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కాగా పీఎం కేర్స్ ఫండ్ వినియోగంపై పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ప్రశ్నలు సంధించారు. కోవిడ్-19 నిరోధక వ్యాక్సిన్లను ఉచితంగా ప్రజలకు ఇచ్చేందుకు పీఎం-కేర్స్ (ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ) నిధిని ఎందుకు ఖర్చు చేయకూడదని ప్రశ్నించారు. దేశంలో ఆక్సిజన్ లేదని, అవసరమైన మందులు అందుబాటులో లేవని మండిపడ్డారు. దేశంలో మందుల కొరత వేధిస్తుంటే, కేంద్ర ప్రభుత్వం వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌కు రావలసిన ఆక్సిజన్‌ను యూపీకి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement