Thursday, March 28, 2024

చేయూత వేరు.. ఉచితం వేరు!

రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాల అమలు పేరిట అధికా రంలోకి రాగానే ఉచితంగా విద్యుత్‌, ఫీజులు మాఫీ వంటి కార్యక్రమాలను అమలు జేయడం వల్ల అంతిమంగా ఆ భారం ప్రజలపై పడుతోందని ఆర్థిక రంగానికి చెందిన నిపుణులు చాలా కాలంగా హెచ్చరిస్తున్నారు. తాజాగా వామపక్ష భావజాలం గల జయతి ఘోష్‌ వంటి వారు కూడా ప్రజలకు సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అనీ, ఉచితం పేరిట వారికి ధన, వస్తు రూపం లోనూ, సేవల రూపంలోనూ సాయం అందించడం వల్ల అంతిమంగా ఆ భారం ఆయా వర్గాలపైనే పడుతోందని మేధావులు హెచ్చరించారు.. సంక్షేమ రాజ్యంలో ఆపన్న వర్గాలకు చేయూ తనివ్వడాన్ని ఎలా ఆపేస్తారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. నిజానికి ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఈఅంశంపై ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఢిల్లిలో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ప్రభుత్వం విద్యుత్‌, నీరు ఉచితంగా అందించడాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రస్తావించారు. వివిధ పార్టీల నాయకులే కాకుండా, బీజేపీలో కొందరు నాయకులు కూడా దీనిని ప్రశ్నిస్తున్నారు. పేదలకు చేయూత నిచ్చే కార్యక్రమాలను బంద్‌ చేయరా దనీ, పేదలు స్వశక్తిపై జీవించేవరకూ చేయూతను అందించవల్సిందేనని వామపక్ష మేధావులే కాకుండా, లౌకిక ప్రజాస్వామ్య వాదులు స్పష్టం చేస్తున్నారు. ఉచితాలను బంద్‌ చేయాలనే డిమాండ్‌ బీజేపీ హయాంలోనే కాదు, పూర్వపు యూపీఏ హయాంలోనూ తరచూ వచ్చేది. అయితే, యూపీఏ ప్రభుత్వం వామపక్షాలు, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడటం వల్ల ఉచితాల్లో కోత విధించేందుకు సాహసించలేదు. సరళీకృత ఆర్థిక విధానాల్లో ప్రైవేటీకరణకు ప్రాధాన్యం పెరిగింది. బ్యాంకుల ద్వారా కార్పొరేట్‌, పారిశ్రామిక సంస్థలకు రాయితీలు అందించే విషయంలోనే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉచిత హామీలను రాజకీయ పార్టీలు ఎవరికి అవసరం వచ్చినప్పుడు అవి గుప్పిస్తున్నాయి.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ని వెనక్కి నెట్టి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు అన్ని అవకాశాలనూ వినియోగించుకోవాలనుకుంటున్న ఆప్‌ ఉచిత వాగ్దానాలను గుప్పిస్తోంది. గుజరాత్‌ ప్రధాని స్వ రాష్ట్రం కావడం వల్ల ఇది సహజంగానే ఆయనకు ఇబ్బంది కలిగించి ఉండవచ్చు. ఇటీవల పంజాబ్‌ ఎన్నికల్లో కూడా ఆప్‌ ఇదే మాదిరి ఉచిత వాగ్దానాలు చేసి ఓట్లు దండుకుంది. అదే మాదిరిగా గుజరాత్‌లో కూడా జరగవచ్చని కమలనాథులు కలవరపడటం సహజమే. ఎన్నికల ముందు కాకుండా, మామూలు రోజుల్లో బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతి కోసం అమలు జేసే సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు చేతివృత్తి పనివారికి ముడి సరకులు అందించడం, బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం, సబ్సిడీపై విద్యుత్‌ను అందించడం వంటి వాగ్దానాలను పూర్వపు ప్రభుత్వాలు అమలు జేసేవి.
ఈ మధ్య పార్టీల మధ్య పోటీ పెరిగి సబ్సిడీ కాదు, పూర్తిగా ఉచితంగానే విద్యుత్‌, నీరు అందిస్తామని పార్టీలు వాగ్దానం చేస్తున్నాయి. ఇవి అలవి కాని వాగ్దానాలే. ఎందుకంటే, థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఆధారమైన బొగ్గు నిల్వలు నిండుకుంటున్నాయి. జల విద్యుత్‌ వాటాల విషయంలో రాష్ట్రాల మధ్య ఎడతెగని వివాదాలు ఏర్పడుతున్నాయి. బ్యాంకు రుణాలు తీసుకున్న పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు సకాలంలో తీర్చకపోవడం వల్ల మొండిబకాయిలు పెరిగిపోతున్నాయి.

క్రోనీ కేపిటలిజం విధానం వల్ల అవినీతి పెరిగిపోతోంది. బ్యాంకులకు బకాయిలు పెరిగిపోవడానికి ఇదే కారణం. ద్రవ్యోల్బణం పెరిగి పోవడానికి ప్రధాన కారణం మొండిబకాయిలేనని ఆర్థిక నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ సుడిగుండం నుంచి రాష్ట్రాలు బయటపడలేక పోవడానికి రాజకీయాలే కారణం, గతంలో ఒకటి రెండు రాష్ట్రాల్లోనే ఈ ధోరణులు ఉండేవి. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు జనాకర్షక విధానాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఉత్పత్తి కన్నా, వ్యయం పెరిగి పోవడంతో అన్ని రాష్ట్రాలూ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అందుకే ఇప్పుడు సంక్షేమ పథకాలపై అందరి దృష్టి పడింది. ఉత్పత్తికి దోహదం చేసే సబ్సిడీలు ,చేయూత అందజేయడానికి బదులు ఓట్ల మీద దృష్టితో వీటిని అమలు జేస్తుండటం వల్లనే ఆర్థిక రంగంలో విపరిణామాలు ఏర్పడుతున్నాయి. సంక్షేమానికీ, అభివృద్ధికీ సమతూక పరిస్థితిని పాటిస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement