Friday, April 19, 2024

Delhi | సంసద్ రత్న అవార్డుల ప్రదానం.. బండారు దత్తాత్రేయ నుంచి పురస్కారం అందుకున్న ఎంపీ విజయసాయి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ సభ్యులుగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం సంసద్ రత్న అవార్డులను ప్రదానం చేసింది. 2023 సంవత్సరానికిగానూ 13 మంది ఎంపీలు, రెండు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలను సంసద్ రత్న, ఒక ఎంపీని లైఫ్ టైమ్ అచీవ్‍మెంట్ అవార్డుకు కేంద్రం ఎంపిక చేసింది. శనివారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డుకు ఎంపికైన రెండు పార్లమెంటరీ కమిటీల్లో విజయసాయి అధ్యక్షత వహిస్తున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (రవాణా, పర్యాటకం, సాంస్కృతిక వ్యవహారాలు) కూడా ఒకటి.

- Advertisement -

విజయసాయిరెడ్డితో పాటు రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీ మాజీ ఛైర్మన్, మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కుడా దత్తాత్రేయ చేతుల మీదుగా సంసద్ రత్న అవార్డును అందుకున్నారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం 2010 నుంచి ప్రదానం చేస్తున్న ఈ అవార్డులను ఇప్పటివరకు 90 మంది పార్లమెంటేరియన్లు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… పురస్కారం అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీలలో అన్ని పార్టీల ఎంపీలతో ప్రతి అంశంపై సమగ్ర చర్చ జరుగుతుందని తెలిపారు.

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల తరహాలో రాష్ట్రాల్లోనూ ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. దీనివల్ల ఎంపీల మాదిరిగా ఎమ్మెల్యేలకు కూడా చట్టాల తయారీలో భాగస్వామ్యం కల్పించినట్టు అవుతుందని అభిప్రాయపడ్డారు. స్టాండింగ్ కమిటీలలో ఉండే అధికార, విపక్ష ఎంపీలు అన్ని అంశాలపై లోతైన చర్చ జరుపుతారని టీజీ వెంకటేశ్ చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లో బాగా పని చేస్తారని గవర్నర్ దత్తాత్రేయ ప్రశంసించారు. తాను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన పనితీరును గమనించానని గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement