Friday, April 26, 2024

వెంటాడుతున్న అకాల వర్షాలు, అందుబాటులో లేని టార్పలిన్‌ షీట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రస్తుతం అకాల వర్షాలు వెంటాడుతుండడంతో ధాన్యాన్ని సంరక్షించుకునేందుకు సరిపడా టార్పలిన్‌ షిట్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు , ఎటు వైపు నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందో తెలియని పరిస్థితుల్లో కల్లాల్లో ధాన్యం రాశులతో రైతులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షం వస్తే పంటను కాపాడుకునేందుకు పాలిథిన్‌ కవర్లు తగినన్ని అందజేయడంలో జిల్లాలోని మార్కెటింగ్‌, పౌరసరఫరా, వ్యవసాయశాఖల అధికారులు విఫలవుతున్నారు. ఒక్కో కల్లంలో నలుగురైదుగురు రైతులకు టార్పలిన్లు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు. అవికూడా అక్కడక్కడా రంద్రాలు పోయి ఉంటున్నాయని రైతులు వాపోతున్నారు. వర్షం వచ్చిన సమయంలో పాలిథిన్‌ కవర్లకు ఉన్న రంద్రాల నుంచి నీరు కారి ఆరబెట్టిన ధాన్యం రాశులు తడుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో చేసేది లేక రైతులే తమ సొంత ఖర్చుతో కవర్లను తెచ్చుకుని పంటను కాపాడుకుంటున్నారు.

ఫ్లెక్సీలు, చీరలు, అందుబాటులోని అరొకర పాలిథిన్‌ షీట్లతో ధాన్యం రాశులను కప్పుతున్నారు. ధాన్యం తడవకుండా టార్పలిన్లు కప్పినా నేలపై నుంచి వర్షపు ధారలతో ధాన్యంతో కొట్టుకుపోతోంది. ఈ పరిస్థితుల్లో చిన్నపాటి వర్షం వచ్చినా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ధాన్యం తడుస్తోందని వాపోతున్నారు. వడ్లు తడిస్తే తరుగు ఎక్కువగా తీస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో వేగం పెంచాలని రైతులు కోరుతున్నారు. ధాన్యం కల్లానికి తీసుకొచ్చాక కనీసం 10 రోజలపాటు తూకం కోసం వేచి చూడాల్సి వస్తోందని, తూకం అయ్యాక లోడింగ్‌కు మరో మూడు రోజులు పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందే వస్తుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. ఇప్పటికీ చాలా మంది రైతులు ఇంకా వరికోతలు పూర్తి చేయలేదు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లు చేస్తారో లేదోనన్ను అనుమానంతో తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 50శాతం మంది రైతులు ఆలస్యంగా వరిసాగుకు పూనుకున్నారు. ఈ పరిస్థితుల్లో ధాన్యం కోతలు పూర్తిగా ముగియాలంటే మరో 15 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement