Friday, April 19, 2024

యుద్ధప్రాతిపదికపై అగ్రి ఇన్‌ఫ్రా ఫ్రాజెక్టులు.. ఏడాదిలోగా అన్నీ పూర్తి కావాలి : జగన్‌

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయ మౌలిక వసతుల కల్పన నిధి (అగ్రి ఇన్‌ ఫ్రా ఫండ్‌) కింద రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అదికారులను ఆదేశించారు. ఒక ఏడాదిలోగా నిర్మాణాలన్నీ పూర్తి కావాలని దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో గురువారం అగ్రి ఇన్‌ ఫ్రా ఫండ్‌ కింద చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి గ్రామంలో ఆర్బీకే స్ధాయిలో ప్రైమరీ ప్రాసెసింగ్‌, డ్రైయింగ్‌ ప్రాట్‌ఫాంలు, గోదాములు, కోల్డ్‌రూంలు నిర్మించాలని సీఎం ఆదేశించారు. ప్రపంచ వేదికలపై రైతు భరోసా కేంద్రాలకు వస్తున్న గుర్తింపును దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాలన్నారు. ప్రతి ఆర్బీకేలో యంత్రసేవా పథకాన్ని అమలు చేయాలి..ప్రతి ఆర్బీకేలో క్లస్టర్‌ స్థాయిలో యంత్రాలు అందుబాటులో ఉండాలి.. రైతులకు వ్యక్తిగత స్థాయిలోనూ సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను అందించే విషయమై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
రెండు వేల కిసాన్‌ డ్రోన్స్ రాష్ట్రంలో తొలివిడతలో రెండు వేల అగ్రి డ్రోన్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి మండలంలో కనీసం 4 ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ ప్రాజెక్టును ప్రారంభించాలి..ఆర్బీకేల పరిధిలో డ్రోన్‌ పైలట్లను గుర్తించాలన్నారు. రైతుల్లో సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌, ఇంటర్‌ సైన్స్‌ గ్రూపు చదువుకున్న రైతులను గుర్తించి డ్రోన్‌ పనితీరును వివరించాలన్నారు. నానో యూరియా(ఫెర్టిలైజర్స్‌) వాడకంపై కూడా దృష్టి పెట్టాలి..ఉద్యానపంటల ఉత్పత్తులు అధికంగా ఉన్నచోట డ్రై గోదాముల నిర్మాణం చేపట్టాలన్నారు.

రూ.16,404.86 కోట్లతో ప్రాజెక్టులు

రాష్ట్రంలో అగ్రి ఇన్‌ ఫ్రా ఫండ్‌ కింద రూ.16,404.86 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్టు సమీక్షా సమావేశంలో సీఎంకు అధికారులు వివరించారు. వ్యవసాయ అనుబంధశాఖల్లో సుమారు 30 రకాల పనులు చేపడుతున్నట్టు తెలిపారు. సుమారు 4,200 ప్రాంతాల్లో గోదాములు, కోల్డ్‌ రూములు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాంల నిర్మాణ పనులు కొనసాగుతున్నట్టు- వెల్లడించారు. ఇప్పటికే తొలిదశలో 1165 గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫాంల నిర్మాణానికి సంబంధించి స్ధలాల ఎంపిక పూర్తయిందనీ.. 510 చోట్ల నిర్మాణాలు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. మార్చి 2023 నాటికి ప్రాజెక్టుల నిర్మాణాలన్నీ దాదాపు తుది దశకు చేరుతాయని వెల్లడించారు.

అనకాపల్లిలో అమూల్‌ ప్రాజెక్టు

జగనన్న పాలవెల్లువలో భాగంగా అనకాపల్లి జిల్లాలో త్వరలో అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్టు- అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రైవేటు- డెయిరీల్లో రైతులు మోసానికి గురికాకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాలసేకరణ, వెన్న శాతం నిర్ధారణలో కచ్చితమైన ప్రమాణాలు పాటించాలన్నారు. జగనన్న పాలవెల్లువ కార్యక్రమాల ద్వారా ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ సూచించారు. రెండు దశల్లో వైయస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవ -అంబులెన్స్‌లు ప్రారంభించడానికి చర్యలు చేపట్టినట్టు- అధికారులు తెలిపారు. తొలిదశలో 175, రెండో దశలో మరో 165 అంబులెన్స్‌లను సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -

డిసెంబరు నాటికి 4 ఫిషింగ్‌ హార్బర్లు

ఫేజ్‌ -1లో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయనీ, ఫేజ్‌ -2లో చేపట్టనున్న మిగిలిన 5 షిఫింగ్‌ హార్బర్ల (బుడగట్లపాలెం, పూడిమడక, బియ్యపుతిప్ప, వాడరేవు, కొత్తపట్నం) పనులు జులైలో ప్రారంభించనున్నట్టు- అధికారులు వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డి, ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం వీ యస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌.ఎస్‌ రావత్‌, మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వై. మధుసూధన్‌రెడ్డి, పుడ్‌ ప్రాససింగ్‌ కార్యదర్శి ఎం.కె మీనా, అగ్రికల్చర్‌ కమిషనర్‌ సి.హరి కిరణ్‌, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎస్‌.ఎస్‌ శ్రీధర్‌, మార్క్‌ఫెడ్‌ ఎండీ పీ.ఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె. కన్నబాబు, ఏపీడీడీసీఎఫ్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ బాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement