Thursday, April 25, 2024

Big Story: రాహుల్‌ రాకతో తీరుమారేనా.. రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో దళారులకు చెక్‌ప‌డేనా?

రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖకు కొత్త ఐజీగా రాహుల్‌ బొజ్జ నియామకంతోనైనా ఆ శాఖలో వేళ్లూనుకొని పోయిన అవినీతి ప్రక్షాళన జరగాలని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రేటర్‌ పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అవినీతి, అక్రమాలకు కేంద్రాలుగా తయారయ్యాయని పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో రాహుల్‌ బోజ్జ చార్జి తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముక్కుసూటి తనం, నిజాయితాగా ఉండే ఆయన గ్రేటర్‌లోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను దారిలో పెడుతారని నగర వాసులు ఎదురు చూస్తున్నారు.

ప్రభ న్యూస్‌, హైదరాబాద్‌ ప్రతినిధి: గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ఉన్న స బ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు అవినీతి అక్రమాలకు కేంద్రాలుగా తయారయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు ప్రజల రక్తాన్ని తాగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ శాఖకు కొత్త ఐజీగా భాద్యతలు చేపట్టిన రాహుల్‌ బొజ్జకు అనేక సవాళ్లు ఎదురు కానున్నాయిని తెలుస్తోంది. విధి నిర్వహణలో నిజాయితి, ముక్కు సూటిగా ఉండే ఆయన తన శాఖలో జరుగుతున్న అవినీతి, బ్రోకర్ల దందా, స్టాంప్‌ వైండర్ల బ్లాక్‌ మార్కెటింగ్‌పై ఎలా స్పందిస్తారోనని గ్రేటర్‌ వాసులు ఎదురు చూస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలోని చిక్కడ్‌ పల్లి, బోయినపల్లి, మారేడ్‌ పల్లి, సికిద్రాబాద్‌, హైదరాబాద్‌, ఆజంపుర, దూద్‌ బౌలి, ఎర్రగడ్డ, చార్మినార్‌, గోల్కొండ, ఎస్‌ఆర్‌ నగర్‌, ఎల్‌బినగర్‌, నార్సింగి, ఉప్పల్‌, మేడ్చల్‌తో పాటు మొత్తం 42 కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో ప్రతి రోజు కొత్త రిజిస్ట్రేషన్ల తో పాటు ఈసీ, వ్యాల్యూవేషన్‌, వివాహ నమోదు, ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌, సొసైటీ రిజిస్ట్రేషన్‌ తదితర పనులకు సంబంధించి దాదాపు 2 వేలకు పైగా ఫైళ్లు వస్తాయి.. ప్రతి పనికి రేటు నిర్ణయించి పైసలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్‌ వార్డు నుంచి మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ అవినీతి దందాలో భాగస్వామ్యం ఉందనే విమర్శలు ఉన్నాయి. కొత్త బాస్‌ రాకతోనైనా ఈ శాఖలో కంపుకొడుతున్న అవినీతి, అక్రమాలకు చెక్‌ పడుతుందా అనేది వేచి చూడాలి.

దళారుల అడ్డాగా ఆఫీసులు
బ్రోకర్లు ఆఫీసులోకి రావద్దని నిబంధనలు ఉన్నా దళారుల తాకిడి మాత్రం ఆగడం లేదు. డబ్బులియ్యందే ఫైళ్లు కదలని పరిస్థితి నెలకొంది. దళారులు, బ్రోకర్ల ద్వారా ప్రతి రోజు అధికారులకు లక్షలాది రూపాయలు ముడుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో దళారులు చెప్పిందే వేదం. వ్యాల్యూవేషన్‌, ప్రాపర్టి రిజిస్ట్రేషన్‌, వివాహ నమోదు, ఫర్మ్‌ రిజిస్ట్రేషన్‌, సొసైటీ రిజిస్ట్రేషన్‌ తదితర అన్ని రకాల పనుల్లో సింహ భాగం వారి ద్వారానే జరగుతున్నాయి. దళారులు వారి పేరు లేదా సంస్థ పేరును కోడ్‌ లాంగేజ్‌లో పెన్సిల్‌తో చిన్నగా రాసి ఫైళ్లు సమర్పిస్తారు. వారి కోడ్‌లను లెక్కగట్టుకుని పని చేసిన తరాత అయా డాక్యుమెంట్లను బట్టి నిర్ణయించిన మొత్తాన్ని బ్రోకర్ల నుంచి వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.

స్టాంప్‌ వైండర్ల బ్లాక్‌ దందా
గ్రేటర్‌ పరిధిలో దాదాపు వెయ్యి మందికి పైగా స్టాంప్‌ వైండర్లు ఉన్నారు. వీరు రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి స్టాంప్‌లను కొనుగోలు చేసి వి నియోగదారులకు అమ్ముతారు. స్టాంప్‌ పేపర్ల మీద ఉన్న రేటు కంటే అదనంగా నయా పైసా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం స్టాంప్‌లను విక్రయించే వైండర్లకు 5 శాతం కమిషన్‌ చెల్లిస్తుంది . అయినా స్టాంప్‌ వైండర్లు తమకు సర్కార్‌ ఇచ్చే కమిషన్‌ను కాదని అదనంగా ముప్పై నుంచి యాభై శాతం వరకు స్టాంప్‌ పేపర్ల విలువ, డిమాండ్‌ను బట్టి వినియోగదారులను నుంచి వసూలు చేస్తున్నారు. అన్ని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని కింది స్థాయి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారి వరకు అందరికి తెలుసు. అయినా ఎవరు పల్లెత్తి మాట అనరు. ఎందు కంటే ఈ తతంగమంతా వారి కను సన్నల్లోనే నడుస్తుందనే విమర్శలున్నాయి.

ఇప్పటికైనా చర్యలు తీసుకోండి
కొత్త ఐజీకి గ్రేటర్‌ వాసుల విజ్ఞప్తి
గ్రేటర్‌ పరిధిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై తనిఖీలు చేసి కట్టడి చేయాలని ఆ శాఖకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన రాహుల్‌ బొజ్జకు గ్రేటర్‌ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న తతంగమంతా ఉన్నతాధికారులకు తెలిసినా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఇప్పటి వరకు ఉంది. కొత్త బాస్‌ రాకతోనైనా కింది నుంచి పై వరకు సమగ్ర ప్రక్షాళన జరుగుతుందని ఆశాభావం అందరిలో వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌ కలెక్టర్‌గా ఉన్నప్పుడు జిల్లాలో రెవెన్యూ శాఖను గాడిలో పెట్టిన ఆయన స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖలో సైతం తన దైన ముద్ర వేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement