Wednesday, December 1, 2021

నువ్వా ….నేనా..! ముఖ్యమంత్రి కోర్టులో ఆ ఇద్దరు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం ఆది నుంచి 10 మంది వరకు పోటీపడగా చివరకు ఇద్దరి పేర్లు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఇద్దరు కూడా భూపాలపల్లి శాసనసభ్యులకు అత్యంత సన్నిహితులు కావడంతో ఇద్దరిలో ఒక్కరికి జిల్లా అధ్యక్ష పదవి వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరొకరికి ఏదైనా నామినేట్ పోస్ట్ లభించేలా స్థానిక శాసన సభ్యుడు గండ్ర వెంకటరమణారెడ్డి.. తన ప్రయత్నంలో తాను ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు జిల్లా అధ్యక్షులు ముఖ్యమంత్రి ప్రకటించలేదు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర  అధ్యక్ష పదవి కోసం ఆదివారం  ముఖ్యమంత్రి తరపున సన్నిహితులు నామినేషన్ వేశారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల అధ్యక్షుల నియామకం కూడా తొందర్లోనే ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అంటున్నాయి. వాస్తవానికి గత నెలాఖరులో గాని జిల్లా అధ్యక్షుల పేర్లను ప్రకటించాల్సి ఉండగా అసలు అసెంబ్లీ సమావేశాలు, దసరా పండుగ మూలంగా కొంత వాయిదా పడ్డట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అధ్యక్ష పదవి కోసం చాలామంది క్రియాశీల కార్యకర్తలు తమ పేర్లను పరిశీలించవలసిందిగా ఎమ్మెల్యే వెంకట రమణ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. పోటీపడేవారు ఎంతమంది ఉన్నా అవకాశం ఒక్కరికి మాత్రమే ఉంటుంది. కనుక చాలామందికి గండ్ర వెంకటరమణారెడ్డి వారికి నచ్చజెప్పి పోటీ నుంచి విరమింపజేశారు. అయినప్పటికీ ఐదారుగురు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీలో చాలా అనుకూలమైన నాయకుల ద్వారా తమ పేర్లను పరిశీలనకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. భూపాలపల్లిలో టిఆర్ఎస్ పార్టీలో అధ్యక్ష పదవి కోసం చివరికి ఇద్దరు మిగిలినట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆయన సతీమణి వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి రెడ్డి ఆశీస్సులతో ప్రస్తుతం పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు నువ్వా నేనా..? అన్న రీతిలో పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు బీసీ కాగా మరొకరు ఓసి వర్గానికి చెందిన వారు. రాజకీయ సమీకరణాలు కుల సమీకరణాలు ప్రాంతీయ సమీకరణ దృష్ట్యా అధ్యక్ష పదవి ఇద్దరిలో ఒకరిని వరించే అవకాశాలు ఉంటాయి. శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి చివరికి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరిని అధ్యక్ష పదవి అలంకరించిన తనకు  సమ్మతమేననే అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తున్నది. రెండో వ్యక్తి సేవలను కూడా పార్టీ వినియోగించుకుంటుదనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్నది. గత 20 సంవత్సరాలుగా గండ్ర వెంకటరమణ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా తన వెంట నడిచి నమ్మిన బంటుగా నియోజకవర్గంలో పేరు సంపాదించి ప్రస్తుతం అధ్యక్ష పోటీలో ఉన్న బుర్ర రమేష్ గౌడ్ బీసీ వర్గానికి చెందినవాడు.

పార్టీ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ రమణ రెడ్డి కి అందుబాటులో ఉంటున్నారు. 2018 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో గండ్ర.. కాంగ్రెస్ పార్టీలో గెలిచి 2019లో టిఆర్ఎస్లోకి చేరిపోయారు. ఆయనతోపాటు బుర్ర రమేష్ గౌడ్ తన అనుచరులతో  శాసనసభ్యులు రమణారెడ్డి బాట పట్టారు. ఇక మిగిలిన రెండో వ్యక్తి కళ్లెపు రఘుపతి రావు టిఆర్ఎస్ పార్టీ లోనే సీనియర్ క్రియాశీల కార్యకర్త. భూపాలపల్లి ఎంపీపీగా ఐదేళ్లపాటు రఘుపతి రావు సేవలందించారు. పిలిస్తే పలికే నాయకుడిగా అహర్నిశలు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడని పేరు ఉంది. రఘుపతి రావు సతీమణి కళ్లెపు శోభ ప్రస్తుతం భూపాలపల్లి జడ్పి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. గతంలో ఒకసారి అధ్యక్ష పదవి అందినట్లే అంది చేజారిపోయింది. జిల్లా కమిటీలను వేయకపోవడం వల్లనే ఆ పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో నియోజకవర్గంలో శాసనసభ్యులకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈ సారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎంపిక జరుగుతున్నందున తనకే అవకాశం ఉంటుందని నమ్మకంతో రఘుపతి రావు పావులు కదుపుతున్నారు. జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి వచ్చినా పార్టీ అభివృద్ధి కోసం కలిసి పని చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటూ పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులు ఎవరికి వారే చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఆ ఇద్దరే కాకుండా మూడో వ్యక్తి కూడా హఠాత్తుగా తెరపైకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మరో ఓసి నేత పోటీ పడుతున్నారు. ఈ నేత గత 15 రోజులుగా హైదరాబాద్లోనే ఉండి అధ్యక్ష పదవి కోసం తాను నమ్ముకున్న నాయకులతో మంతనాలు సాగిస్తున్నారు. జిల్లాల వారీగా అధ్యక్షులను ఎంపిక చేయడానికి సీఎం కేసీఆర్ జిల్లాల వారి నుంచి శాసనసభ్యుల నుంచి సేకరించిన పేర్లతో పాటు ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించిన వివరాలను క్రోడీకరించి అధ్యక్షుల ఎంపికలను చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వారం రోజుల్లోపు జిల్లా అధ్యక్ష పదవి పై ఉన్న ఉత్కంఠకు తెరపడనుంది.

ఇది కూడా చదవండి: తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్ధేశం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News