Thursday, April 25, 2024

కొలిక్కిరాని మెస్‌ చార్జీల పెంపు.. 30శాతం పెంచాలని సంక్షేమ శాఖ ప్రతిపాదనలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు మెస్‌ చార్జీల పెంపు నిర్ణయం ఆలస్యమవుతోంది. ఉమ్మడిగా ప్రతిపాదనలు చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించినా , సంబంధిత శాఖల మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల నేపధ్యంలో మెస్‌ చార్జీల పెంపు ఇప్పుడున్న వాటికంటే 30 శాతం వరకు ఉండాలని భావిస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం వండిపెట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవలనే రాష్ట్ర వ్యాప్తంగా పలు హాస్టళ్లు, గురుకులాల్లో పుడ్‌ పాయిజన్‌తో విద్యార్థులు అస్వస్థకు గురై ఆసుపత్రుల్లో చేరి చికిత్సను పొందిన విషయం తెలిసిందే.

ఆహారపట్టికలో మార్పులు..
సంక్షేమ శాఖల్లో విద్యార్థులకు అందిస్తున్న మెస్‌ చార్జీలు ఎటు చాలడం లేదు. పెరిగిన ధరలతో ఆహారపట్టిక మేరకు నాణ్యమైన భోజనం అందించడం కష్టమవుతోంది. ఫలితంగా గురుకులాల ఆహారపట్టికలో మార్పులు చేసుకున్నారు. కొన్ని చోట్ల నెలలో నాలుగుసార్లు ఇవ్వాల్సిన మాంసాహారాన్ని రెండు రోజులకు తగ్గించారు. ఈ క్రమంలో నాణ్యమైన ఆహారాన్ని అదించాలంటే తప్పనిసరిగా మెస్‌చార్జీలు పెంచాలని, అందుకు అనువుగా ఐదేళ్ల క్రితం ఖరార్‌ చేసిన చార్జీలు సవరించాలని సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. కనిష్టంగా 30 నుంచి 35 శాతం వరకు గరిష్టంగా 50 శాతం పెంపు ఉండేలా అంచనాలు రూపొందించాయి. అయితే 30 నుంచి 35 వరకు మించితే ఆర్థిక శాఖ నుంచి కొర్రీలు వచ్చే అవకాశం ఉందని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో మెస్‌చార్జీలను తరగతుల వారీగా రూ. 950 నుంచి రూ. 1500 లకు పెంచింది. తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి రోజుకి రూ. 31.66 చొప్పున ఖర్చు చేస్తోంది. ఈ చార్జీలను రూ. 40 పెంచాలని తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. అంటే ఆ విద్యార్థులకు నెలకు రూ. 1200 వచ్చే అవకాశం ఉంది. అలాగే 8, 9,10 తగరగతుల విద్యార్థులకు రూ. 1,100 నుంచి 1,500 వరకు, పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు రూ. 1,500 నుంచి రూ. 2 వేలుగా చెల్లించాలని భావిస్తున్నాయి.

ఉపకార వేతనాలు పెంచాల్సిందే..
గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు మెస్‌ చార్జీలు పెంచితే.. అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డే స్కాలర్‌ విద్యార్థులకు ఉపకరా వేతనాలు పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం డే స్కాలర్‌ విద్యార్థులకు కోర్సుల కేటగిరీల వారీగా నెలకు రూ. 500, రూ. 600 చొప్పున ఉపకార వేతనాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మెస్‌చార్జీల తరహాలో 30 శాతం పెంచితే నెలకు రూ. 650, రూ. 850గా చేసే అవకాశాలున్నాయని సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉపకార వేతనాల పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి మరో రూ. 200 కోట్ల నుంచి రూ. 250 కోట్ల వరకు భారం పడుతోందని అంచనా వేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement