Friday, April 19, 2024

కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వం.. దేశానికి కేసీఆర్ నాయకత్వమే శరణ్యం: ఎంపీ బడుగుల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక బీజేపీ ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కుతోందని టీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నారని చెప్పుకొచ్చారు. దేశం యావత్తూ కేసీఆర్ పథకాలను ఆదర్శంగా తీసుకుంటోందన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని ఏకం చేయడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని, ప్రతిఒక్కరూ ఆయన నాయకత్వాన్ని ఆదరిస్తున్నారని లింగయ్య యాదవ్ తెలిపారు. 42 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంటే బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్రం మోసం చేస్తోందని విమర్శించారు.

నదీ జాలల వివాదాన్ని పరిష్కరించలేదు, రైల్వే లైన్లు, గిరిజన యూనివర్సిటీ ఏవీ ఏర్పాటు చేయలేదని ఎంపీ లింగ‌య్య యాద‌వ్ ధ్వజమెత్తారు. తెలంగాణను కించ పరిచేలా ప్రధాని మాట్లాడినా స్పందించని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు కర్మాగారం రాదని చెప్పడం దురదృష్టకరమన్నారు. వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో దద్దమ్మ ప్రభుత్వముందని బడుగుల లింగయ్య కేసీఆర్ నాయకత్వమే దేశానికి శరణ్యమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తెలంగాణా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో అలాగే దేశాభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తారని ఆయన జోస్యం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement