Thursday, April 25, 2024

వరంగల్ పోలీస్ కమిషనర్ చిత్రానికి క్షీరాభిషేకం

వరంగల్ క్రైమ్ (ప్రభ న్యూస్) : శ్రీరామ నవమిని పురస్కరించుకొని అందరు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకల్లో బిజీగా ఉంటే, వరంగల్ లోని బాలాజీనగర్ కు చెందిన నిరు పేదలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వైభోగం జరిగే వేళనే వరంగల్ పోలీస్ బాస్ ఫ్లెక్సీ వద్ద దేవుడికి చేసిన్నట్టే పూజలు చేసి, పాలాభిషేకం చేసి, భక్తి శ్రద్ధలను చాటుకున్నారు. గురువారం ఏనుమాముల మార్కెట్ ఏరియాలోని బాలాజీనగర్ కు చెందిన భూ బాధితులు లేబర్ కాలనీకి వెళ్లే సర్కిల్ సెంటర్ లో కొత్వాల్ ఏవీ రంగనాథ్ చిత్ర పటానికి క్షీరాభిషేకాలు చేసి, వరంగల్ పోలీస్ బాస్ చూపిన చొరవకు కృతజ్ఞతలు చాటుకున్నారు. ఏ అండదండ లేని నిరుపేదలకు చెందిన స్థలాలను ఏనుమాములకు చెందిన దండుపాళ్యం దండు ఆక్రమించుకొని, బాధితులను భయబ్రాంతులకు గురి చేయడమే కాక, భౌతిక దాడులకు తెగబడ్డారు. సరిగా తిని, తినక కూడబెట్టుకొన్న డబ్బులతో కొనుగోళ్లు చేసిన భూములను అన్యాక్రాంతం చేయడంతో బాధిత కుటుంబాలు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ శరణు కోరారు. రెక్కాడితే గాని డొక్కాడని నిర్భాగ్యుల భూములను కబ్జా చేసే ప్రయత్నంపై సీరియస్ గా స్పందించారు. ఈస్ట్ జోన్ డిసిపి పుల్ల కరుణాకర్, టాస్క్ ఫోర్స్ ఏసీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి, మామూనూరు ఏసీపీ కృపాకర్, ఏనుమాముల సిఐ మహేందర్ ల నేతృత్వంలో ఎస్ఓటి పద్ధతిలో సమగ్ర విచారణ చేపట్టారు. దండుపాళ్యం దండు దర్జా దందాల దారుణాలు వెలుగు చూశాయి. దాంతో వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దండుపాళ్యం దండు దూరాక్రమాలకు చెక్ పెట్టారు. వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ చూపిన చొరవతో తమ భూములు తమకు దక్కడంతో ఆనందోత్సవాలతో సంబరాలు జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా పోలీస్ కమీషనర్ ఏవి రంగనాథ్ ఫ్లెక్సీ క్షీరాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఈ కార్యక్రమంలో షాబోతు శ్రీనివాస్, కోదాటి రమేష్, గౌస బేగం,ఆడెపు భిక్షపతి, రాజు,దేవులపల్లి.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement