Tuesday, April 23, 2024

కన్నుల పండువగా హేమచలుడి వరపూజ

మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల క్షేత్రం (మల్లూరు గుట్ట) పై కొలువై ఉన్న శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి వరపూజ (నిశ్చయ తాంబూల స్వీకరణ) కార్యక్రమం అశేష భక్తజన సందోహం మధ్య ఆదివారం రాత్రి మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలోని రామాలయం సమీపంలోని సంక్రాంతి మండపం వద్ద కన్నుల పండువగా జరిగింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురష్కరించుకుని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు ఆదివారం రాత్రి 7.30 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రవరా పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం ఉదయం స్వామివారికి శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పట్టువస్త్రాలతో అలంకరించి ప్రత్యేక సేవ ( పల్లకి )పై మంగళ వాయిద్యాలతో మల్లూరు గ్రామంలోని సంక్రాంతి మండపం వద్దకు తీసుకు వచ్చారు.

రాత్రి 8 గంటల నుండి 12 గంటల మధ్యలో స్వామివారికి, అమ్మవార్లకు పెళ్లిచూపులు నిశ్చయ తాంబూలాలు స్వీకరణ (వరపూజ)కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహాధికారి శ్రవణం సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు కైంకర్యం రాఘవాచార్యులు, ముక్కామల రాజశేఖరశర్మ, అర్చకులు కారంపూడి పవన్కుమారాచార్యులు, ఈశ్వర్ చంద్ శర్మ, ముక్కామల వేంకట నారాయణ శర్మ (బాబీ), రాజీవ్ శర్మ, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్, మంగపేట రైతు సేవా సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు చిట్యాల పురుషోత్తం, పూజారి సమ్మయ్య, ఆలయ పునరుద్ధరణ ( రెనోవేషన్ )కమిటీ మాజీ చైర్మన్లు పూజారి శ్రీనివాస్, నూతులకంటి ముకుందం, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ పల్లా బుచ్చయ్య , దేవస్థానం సిబ్బంది, గ్రామస్థులు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు. హేమాచలుడి వరపూజా కార్యక్రమం సందర్బంగా ఎలాంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంగపేట ఎస్సై ఎస్కే.తాహెర్ బాబా ఆధ్వర్యంలో మంగపేట పోలీసులు తగిన బందోబస్తు నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement