Thursday, April 18, 2024

వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు టి ఆర్ ఎస్ స‌మ‌ర శంఖం..

వ‌రంగ‌ల్ : వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌కు టిఆర్ ఎస్ పార్టీ స‌మ‌ర శంఖం పూరించింది..హన్మకొండ ఎస్‌వీ కన్వెన్షన్ హాల్‌లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం నిర్వ‌హించింది.. ఈ ఎన్నిక‌ల‌లో అనుస‌రించాల్సిన వ్యూహంపై నేత‌లు, కార్య‌క‌ర్త‌లు చ‌ర్చించారు…ఈ సంద‌ర్భంగా మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర‌రావు మాట్లాడుతూ, టీఆర్ఎస్‌ను విజయపథంలో నడిపే బాధ్యత పార్టీ కార్యకర్తలదేన‌ని అటువంటి పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత త‌న‌ద‌ని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. రైల్వే ప్లాట్‌ఫారం మీద టీ అమ్మిన మోడీ ఆ రైల్వేను అమ్మేస్తున్నార‌ని అన్నారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తే, ఇక ఉద్యోగాలు వస్తాయా? రిజర్వేషన్లు ఉంటాయా? అని ప్ర‌శ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీ టీఆర్ఎస్‌. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ప‌ద‌వులు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖంగా ఉన్న‌ట్లు త్వరలోనే వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. అందుకు సిద్ధంగా ఉండాల‌న్నారు. ఉగాది నుండి వరంగల్ మహానగరంలో ఇంటింటికీ మంచినీరు అందివ్వ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. అంబేద్కర్ జయంతి రోజు ఈ నెల 14న ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారన్నారు. వేలాది కోట్లతో వరంగల్‌ని అభివృద్ధి చేస్తున్న‌ట్లు చెప్పారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ప్రజలు ఉద్యమ కాలం నుంచి టీఆర్‌ఎస్ పార్టీ వెంట ఉన్నారని అన్నారు.
ఇటీవల పట్టభద్రుల ఎన్నికల్లో కూడా భారీ ఎత్తున టీఆర్ఎస్‌కు మద్దతు పలకడం దీనికి నిదర్శనమన్నారు. నేటి వరకు అదే స్ఫూర్తిని కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. రానున్న గ్రేటర్ వరంగల్ మునిసిపల్ ఎన్నికలకు మంత్రి శంఖారావం పూరించారు. ఓరుగల్లు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగాలు కల్పించే వరంగల్ కు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా, గిరిజన యూనివర్శిటినీ ఇవ్వకుండా మాయమాటలు చెబుతున్న పార్టీలకు రానున్న ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే విన‌య‌భాస్క‌ర్ , ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ శ్రీ కడియం శ్రీహరి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న, ఇతర ప్రజా ప్రతినిధుల పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement