Friday, April 26, 2024

పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలి : ఎమ్మెల్యే అరూరి రమేష్

బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హన్మకొండ వడ్డేపల్లి లోని శ్యామల గార్డెన్స్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ప్రజల మధ్యలో చర్చకు తీసుకురావాలని అలాగే సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే కీలకం అని, పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకు తగిన గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్, డివిజన్ ప్రెసిడెంట్ రుద్రోజు మణింద్రనాథ్, డివిజన్ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement