Saturday, April 20, 2024

ధరలు పెంచి ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేశారు: కాంగ్రెస్ ఫైర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డిజిల్‌,గ్యాస్, విద్యుత్ చార్జీలను త‌గ్గించాలంటూ టీపీసీసీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రవ్యాప్తం నిరసనలు తెలుపుతున్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ విద్యుత్తు గ్యాస్ ధరలను తగ్గించాలని, యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని ములుగు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు పండించిన యాసంగి ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని టీపీసీసీ అధికార ప్రతినిధి రవళి రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం వ‌ర‌స‌గా పెట్రోల్‌, డిజిల్, గ్యాస్ ధ‌ర‌లు పెంచుతుండ‌డంతో ప్ర‌జ‌ల‌పై తీవ్ర‌మైన ఆర్థిక భారం ప‌డుతుందరన్నారు. దేశంలో 5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు ఉండ‌డంతో 137 రోజుల పాటు ఆయిల్ ధ‌ర‌లు పెంచ‌ని కేంద్రం.. ఎన్నిక‌లు ఫలితాల అనంతరం 4 రాష్ట్రాల‌లో బిజెపి గెల‌వ‌డంతో తిరిగి పెట్రోల్, డిజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను పెంచ‌డం ప్రారంభించిందని మండిపడ్డారు. 13 రోజుల‌లో 12 సార్లు పెట్రోల్‌, డిజిల్ ధ‌ర‌లు పెంచిందని దుయ్యబట్టారు. గ్యాస్ ధ‌ర‌లు అడ్డ‌గోలుగా పెంచ‌డంతో సామాన్య‌లు భ‌రించ‌లేని ప‌రిస్థితులు నెల‌కొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో 414 రూపాయ‌లు ఉన్న వంట గ్యాస్ ధ‌ర సిలెండ‌ర్ ధ‌ర‌.. నేడు 1030 రూపాయ‌లు అయిందని ధ్వజమెత్తారు. అన్ని నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు మండిపోతున్నాయని అన్నారు. పెట్రోల్‌, డిజిల్ పైన ప‌న్నుల రూపంలో కేంద్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌ను పీల్చి పిప్పి చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

అలాగే రాష్ట్రంలో ప్ర‌భుత్వం విద్యుత్ చార్జీలు పెంచిందని మండిపడ్డారు. విద్యుత్ సంస్థ‌ల‌కు ప్ర‌భుత్వం స‌కాలంలో బ‌కాయిలు చెల్లించ‌క‌పోవ‌డంతో అవి న‌ష్టాల ఊబిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ఆ న‌ష్టాల‌ను అధిగ‌మించ‌డానికి ప్ర‌భుత్వం విద్యుత్ చార్జీల‌ను పెంచి ప్ర‌జ‌ల‌పై అడ్డ‌గోలు భారం వేశాయన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యుత్ సంస్థ‌ల‌కు బకాయిలు చెల్లిస్తే ప్ర‌జ‌ల‌పై భారం వేయాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement