Thursday, April 25, 2024

వైద్యుల నిర్లక్ష్యంతో .. పసికందు మృతి..?

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంసీఎచ్ లో గురువారం పసికందు మృత్యువాత పడిన ఘటన చోటు చేసుకుంది. బంధువులు, బాధితుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ జిల్లాలోని గణపురం మండలంలోని బస్వరాజుపల్లి గ్రామానికి చెందిన ఈరగొని మమత అనే గర్భిణికి నెలలు నిండటంతో బుధవారం రాత్రి పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం (100పడకల ఆస్పత్రి)కి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్యులు ప్రసవం చేస్తామని తెలిపి గురువారం తెల్లవారుజామున చిన్న ఆపరేషన్ చేశారని భర్త తిరుపతి తెలిపారు.

అయితే ఆపరేషన్ అనంతరం శిశువును తమకు చూపించలేదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 9 గంటల తరువాత చూసే సరికి శిశువు మృతి చెందినట్లు గుర్తించినట్లు తెలిపారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో సకాలంలో వైద్యులు అందుబాటులో లేకనే పసిప్రాణం పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాటలు నమ్మి ఆస్పత్రికి వెళితే ఇక్కడ సరైన వైద్యం అందక శిశువును కోల్పోయామని బాధిత కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement