Thursday, April 25, 2024

ఆదిమానవుల జాడలు..

భీమదేవరపల్లి : ఆదిమానవులు ఎక్కడో అడవుల్లో ఉంటారని తెలుసు. కానీ వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గుట్టపై ఇళ్లారా గుండు గుహలో ఆదిమానవులు జీవించిన ఆనవాళ్లు ఉన్నట్టు పురావస్తు చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. కొద్ది రోజులుగా గుండు గుహపై కొల్లేటి శ్రీనివాస్‌, సిద్దమల్ల రాజేందర్‌తో కలిసి ఆయన పరిశోధిస్తున్నారు. ఇందుకు సంబంధించిన విశేషాలను సోమవారం రత్నాకర్‌రెడ్డి వెల్లడించారు. ఇక్కడ టెర్రకోట కేక్స్‌ బయటపడడంతో హరప్పా సంస్కృతి కొత్తకొండ వరకు వ్యాప్తి చెందిందని నిరూపితమైందని తెలిపారు. ఈ గుట్ట కేంద్రంగా సుమారు 10 వేల ఏళ్ల క్రితం నుంచే శిలాయుగపు నాటి ఆదిమానవులు జీవించారని చెప్పారు. ఇళ్లారా గుండు అంటే విశాలమైన గుండు అని అర్థమని వివరించారు. 100 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఉన్న విశాలమైన గుహలో పడమర వైపు ప్రధాన ప్రవేశద్వారం ఉండగా నైరుతి మార్గంలో ఉన్న ద్వారాన్ని మూసివేశారు. గుహ లోపలి నుంచి ఉత్తరం వైపు పైకి వెళ్లే తోవ ఉన్నది. గుహ ముందు భాగంలో సూక్ష్మ రాతి పనిముట్లు, నవీన శిలాయుగం నాటి రాతి గొడ్డలి, పదునైన బలపం రాయి పనిముట్లు లభించాయి. నలు పు, ఎరుపు, బూడిద రంగు మృణ్మయ పాత్రల ముక్కలు, ధాన్యం నిల్వ చేసే గాబుల అంచు లు కనిపించాయి. సమీప రైతులు ఎన్నో ఏళ్లు గా ఇళ్లారా గుండు గుహను పశువుల కొట్టంగా ఉపయోగించడంతో ఆధారాలు కనుమరుగైనట్టు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. ఇళ్లారా గుండును అభివృద్ధి చేస్తే సందర్శనీయ ప్రాంతంగా మారుతుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement