Friday, March 29, 2024

బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు

భూపాలపల్లి టౌన్, బాలలపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. గురువారం తన కార్యాలయంలో లైంగిక నేరాల నుండి పిల్లలను రక్షించే చట్టం-2012 పై జిల్లా బాలల సంరక్షణ విభాగం తయారు చేసిన గోడ పత్రికను అదనపు ఎస్పి, జిల్లా బాలల సంరక్షణ అధికారి హరికృష్ణతో పాటు పోలీసు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పి గారు మాట్లాడుతూ… మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనది బాల్యం అని, అది ఎన్నడూ కూడా ఒడిదుడుకులకు లోనుకాకుండా స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగే అవకాశాన్ని పౌరులందరూ బాలలకు కల్పించాలన్నారు. అంతేకాకుండా చిన్నారులపై లైంగిక దాడులు చేయడం అమానుషమని, ఒకవేళ ఎవరైనా అట్టి అసాంఘిక చర్యలకు పాల్పడినట్లైతే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం డీసీపీఓ హరిక్రిష్ణ మాట్లాడుతూ పిల్లలు మన దేశ సంపద అని, వారి హక్కులకు భంగం కలిగించవద్దని సూచిస్తూ, పిల్లలు లైంగిక, ఇతర దోపిడీలకు గురవుతున్నారని తెలిస్తే ఎవరైనా చైల్డ్ హెల్ప్ లైన్-1098 కు ఫోన్ చేసి తెలిపినట్లైతే వెంటనే నిందితులపై తగిన చర్యలు తీసుకొని, పిల్లల బాల్యానికి భరోసా ఇచ్చిన వారవుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి కాటారం డీఎస్పీలు బోనాల కిషన్, సంపత్ రావు మహాదేవపూర్, చిట్యాల, కాటారం, సిఐలు నరసయ్య, సాయి రమణ, హతీరాం, సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్, ఎస్బి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్లు మోహన్, సైదారావు, శ్రీనివాస్, లీగల్ ప్రొబేషన్ ఆఫీసర్ మోహినోద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement