Saturday, April 20, 2024

పురుగుల మందు తాగి మిర్చి రైతు ఆత్మహత్య

మిర్చి పంట పండక పోవడంతో అప్పుల పాలై కాసిం పల్లికి చెందిన ఓ రైతు తన మిర్చి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే భూపాల్ పల్లి మున్సిపల్ పరిధిలోని కాసిం పల్లికి చెందిన ఎలకంటి ఈశ్వరయ్య (45) అనే రైతు తనకున్న మూడెకరాల భూమిలో మిర్చి పంట వేశాడు. మూడెకరాలలో వేసిన మిర్చి పంట రోగాలు తాకి పూర్తిగా పండలేదు. మూడెకరాల మిర్చి పంటకు దాదాపుగా రూ. 5 లక్షల వరకు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. మిర్చి పంట నష్టం రావడంతో అప్పుల పాలైన ఈశ్వరయ్య అనే రైతు ఆదివారం రాత్రి తన మిర్చి చేనులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కాసింపల్లి ప్రజలు కోరుతున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని భార్య ఎలకకంటి స్వరూప ఫిర్యాదు మేరకు భూపాల్ పల్లి ఎస్ఐ అభినవ్ కేసు నమోదు చేశారు. అప్పుల బాధతో మరణించిన ఈశ్వరయ్య మృతదేహానికి భూపాల్ పల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరి బాబు, జంగేడు పిఎసిఎస్ చైర్మన్ మేకల సంపత్ కుమార్ లు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement