Thursday, April 25, 2024

TS: ఇరుకు రోడ్లు.. పెరిగిన వాహ‌నాలు.. వామ్మో తాండూరులో ట్రాఫిక్ య‌మ డేంజ‌ర్‌!

తాండూరు, (ప్రభన్యూస్‌): తాండూరు పట్టణంలో రోజు రోజుకు ట్రాఫిక్‌ అస్తవ్యస్థంగా మారుతోంది. ఏ ఒక్కరు నిబంధనలు పాటించకపోవడంతో రోడ్లపై వాహనాలు ఎలాపడితే అలా రాకపోకలు సాగిస్తున్నాయి. రవాణా సాగించే రోడ్లపై వాహనాలను పార్కింగ్‌ చేయడంతో రోడ్లన్ని ఇరుకుగా మారి యాక్సిడెంట్లు జ‌రుగుతున్నాయి. వ్యాపార వాణిజ్య కేంద్రంగా ఉన్న తాండూరు పట్టణంలో 71 వేలకు పైగా జనాభా నివసిస్తోంది. పట్టణంతో వ్యాపారం కోసం, సొంత అవసరాల కోసం వినియోగించే వాహనాల సంఖ్య బాగా పెరిగింది.

వివిధ ప్రాంతాల నుంచి ట్రాన్స్‌పోర్టు కోసం భారీగా లారీలు ఇతర వాహనాలు కూడ వస్తుంటాయి. పలు అవసరాల కోసం వాహనాలపై వచ్చే వారు కూడ అధిక సంఖ్యలో తాండూరుకు వస్తుంటారు. తాండూరులో నిర్ధిష్టమైన ట్రాఫిక్‌ వ్యవస్థ లేకపోవడంతో పోలీసు శాఖపై భారం పడింది. పోలీసులు కూడ ట్రాఫిక్‌ను పట్టించుకొకపోవడంతో రోజు రోజుకూ వాహనాల రద్దీ పెరిగిపోతుంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడంతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి.

తాండూరు చౌరస్తా నుంచి విలియమూన్‌ చౌరస్తా మార్గంలో రోడ్డుకు అనుకుని పార్కింగ్‌ చేసిన లారీలు భారీ సంఖ్యలో కనిపిస్తాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో లారీలను రోడ్లపైకి తెచ్చి పార్కింగ్‌ చేస్తున్నారు. వాహనాలపై చర్యలు తీసుకోకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మొన్న ఈ రోడ్డు మార్గంలో ట్రాక్టర్‌, స్కూల్‌ పిల్లల ఆటోలు ఢీకొన్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఈ ప్రమాదానికి ఓ కారణమని స్థానికులు వాపోయారు. మరోవైపు తాండూరు పట్టణంలో ప్రధానమైన ఇందిరా చౌరస్తాలో ప్రతిరోజూ ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడుతోంది.

ట్రాఫిక్‌ నియంత్రణకు ఇక్కడ పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసిన ఎలాంటి ప్రభావం కనిపించడంలేదు. స్కూల్‌, కాలేజీల సమయాలలో మాత్రమే నిబంధనలు పాటించేలా దృష్టిసారిస్తున్నారు. మిగతా సమయాల్లో అన్ని వైపుల నుంచి వాహనాలు రాకపోకలకు రావడంతో రద్దీ ఏర్పడుతోంది. సాధారణ ప్రజలతో పాటు అత్యవసర పరిస్థితులకు వెళ్లే వారు ట్రాఫిక్‌ వ్యవస్థ వల్ల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా తాండూరులో ట్రాఫిక్‌ను గాడిలో పెట్టి ఇబ్బందులు లేకుండా.. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement