Tuesday, April 23, 2024

TS: గంజాయి సప్లయ్ చేస్తే కఠిన చర్యలుంటాయన్న ఏసీపీ సారంగ‌పాణి

పెద్దపల్లి జిల్లా: గంజాయి సరఫరా చేసినా.. విక్రయించినా కఠిన చర్యలుంటాయని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. సోమవారం పెద్దపెల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత 10 రోజులుగా గంజాయి సరఫరా, విక్రయం, సాగుపై డేగకన్ను వేశామన్నారు. ఇప్పటి వరకు డివిజన్ పరిధిలో నాలుగు కేసులు నమోదు చేసి, 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.

సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలోని పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోగత నెల 28న ఓదెల లో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 750 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్న విషయం విధితమే అన్నారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా భూపాలపల్లికి చెందిన మాటురి సాయినిఖిల్, కొత్తగూడెం కు చెందిన నుమావత్ రజినీకాంత్, అన్నారం తండాకు చెందిన భూక్య సాయికుమార్ ల నుండి కొనుగోలు చేస్తున్నారనే సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు.

వీరి వద్ద నుండి 1100 గ్రాములు గంజాయిని సీజ్ చేశామన్నారు. పెద్దపల్లి సబ్ డివిజన్ లో గంజాయి సరఫరా చేసిన విక్రయించిన కేసులు నమోదు చేయడంతోపాటు పిడియాక్ట్ నమోదు చేస్తామన్నారు. గంజాయి నిర్మూలన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ప్రజలు గంజాయి సరఫరా పై పోలీసులకు సమాచారం అందించాలన్నారు. గంజాయి సరఫరా చేసే వ్యక్తులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీఐ ఇంద్రసేన రెడ్డి, ఎస్సై లు లక్ష్మణ్, రాజేష్ లతో పాటు సిబ్బందిని ఏసిపి అభినందించి నగదు రివార్డులను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement