Tuesday, April 23, 2024

కేసీఆర్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తా: లక్ష్మీకాంతరావు

మాజీ మంత్రి ఈటలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలకు పదను పెట్టారు. నిన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు చెందిన మంత్రులు, నేతలు ఈటలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు కూడా ఈటల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ నాయకుడు ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు అన్నారు. మాజీ మంత్రి ఈటల ఈటల సొంత పార్టీ వారినే ఇబ్బందులకు గురి చేశారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఈటలను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ ఎన్నో అవకాశాలు కల్పించారని, బీసీలకు సీఎం సముచిత స్థానం కల్పించారని గుర్తు చేశారు. అసైన్డ్ భూములు కొనరాదని తెలిసికూడా తెలియనట్లు వ్యవహరించడం సమంజసం కాదని లక్ష్మీకాంతరావు తెలిపారు. మంత్రి పై అభియోగాలు వచ్చినప్పుడు విచారణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. రైతు బంధును ఈటల రాజేందర్ నియోజకవర్గంలోనే సీఎం ప్రారంభిస్తే దాన్ని విమర్శించారని మండిపడ్డారు. కేసీఆర్ ఆదేశిస్తే హుజూరాబాద్ నుంచి ఈటలపై పోటీ చేస్తానని లక్ష్మీకాంతరావు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement