Friday, April 19, 2024

కేసీఆర్ ఢిల్లీలో ఉంటే విపక్షాలకు నిద్రపట్టడం లేదు: జీవన్ రెడ్డి

టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ను బొందపెట్టడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నం అని అన్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఓ లిల్లీపుట్ అని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీలో వారం రోజులు ఉంటే ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదన్నారు. సీఎం- పీఎంను ఎందుకు కలుస్తారో తెలియకుండా రేవంత్ రెడ్డి బక్వాజ్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రిని సీఎం కేసీఆర్ కలవడం ఆనవాయితీ అని తెలిపారు. గతంలోనూ చాలా మంది ముఖ్యమంత్రులు ప్రధానులను కలిశారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ప్రధాని మోదీని కలిశారన్నారు. చైనా రాయబారిని కూడా కలిశారని, మరి అది దేశద్రోహమా అని ప్రశ్నించారు.

చంద్రబాబు ప్రధానిని కలిస్తే అది ఏ బంధం అని అడిగారు. తమది ఫెవికాల్ బంధం కాదు.. ప్రజా బంధం అని స్పష్టం చేశారు. మతత్వ పార్టీలతో పొత్తులు పెట్టుకునే చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని విమర్శించారు. రేవంత్‌ రెడ్డి.. గోబెల్స్‌ రేవంత్‌రెడ్డిగా మారిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి అభ్యర్థి దొరకడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే హుజురాబాద్ లో కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రేవంత్ రెడ్డియే స్వయంగా పొటీ చేయాలన్నారు. బండి సంజయ్ సీఎం ను తిట్టడం తప్ప- బీజేపీ ప్రణాళిక ఏంటో చెప్పడం లేదని విమర్శించారు. సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్‌ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు పద్ధతి మార్చుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు.

ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు

Advertisement

తాజా వార్తలు

Advertisement