Wednesday, October 9, 2024

Tributes – గోండు లిపి పండితుడు జంగు ఇక లేరు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : గుంజాల గోండి లిపి పండితుడు కొట్నాక్ జంగు (86) మంగ‌ళ‌వారం మృతి చెందారు. ఆయ‌న మృతితో గోండు గిరిజన గూడెలు మూగబోయాయి. గంగోజి, లింగోజి వద్ద గుంజాల గోండి లిపిని నేర్చుకున్న కొట్నాక్ జంగు మారుమూల పల్లెలో జన్మించి గోండి, తెలుగు ఇంగ్లీషు, మరాఠీ భాషల్లో జంగు అప్పట్లోనే ప్రావీణ్యం సంపాదించాడు.

రాతప్రతులతో గోండి భాషకు ప్రాచుర్యం
1940లో పెందూర్ లింగోజి, కుమ్ర గంగోజి రాసిన రాతప్రతులను కోట్నాక్ జంగు చదివి పాండిత్యం సంపాదించారు. ఆ లిపిలో రాయడం, చదవడంలో జంగు నిష్ణాతుడు. గుంజాల గోండి లిపి అధ్యయన వేదిక ద్వారా ఆ రాతప్రతులను సాఫ్ట్ వేర్ చేయడంతో పాటు, గుంజాల గిరిజన గ్రామంలో గోండి లిపి అధ్యయన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 2014లో అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు, ఐటీడీఏ పీఓ జనార్ధన్ నివాస్ ఈ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి కృషి చేశారు.

గోండు లిపిలో విద్యా బోధ‌న‌
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 పాఠశాలలో నెలకొల్పి 420 మంది విద్యార్థులకు గోండు లిపిలో విద్యాబోధన చేశారు. గోండు భాషలోనే కొట్నాక్ జంగు మొదటి వాచకం, రెండో వాచకం సొంతగా రాసి ప్రపంచానికి భాష ప్రాధాన్యతను చాటి చెప్పాడు. సాధారణ వ్యక్తి నాలుగు భాషల్లో నిష్ణాతుడు కావడం విశేషం. ఆయన మృతి చెందడం పట్ల రాయి సెంటర్ మేడిలు, ఆదివాసీలు నివాళులర్పించారు.

జంగుతో అనుబంధం విడదీయలేనిది..
గోండు లిపి కి సంబంధించిన ప్రతులను భద్రంగా దాచుకొని, ఈ భాషకు సంబంధం బాంధవ్యాలు లేని గొండుల చరిత్రను బయట ప్రపంచానికి తెలిపిన మహా వ్యక్తి కొట్నక్ జంగు అని ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు అన్నారు. ఆయన మరణం గోండి భాషకు గుంజాల లిపికి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయ‌న‌ను ఇటీవలే కలిసి భాష లిపి మూలల గురించి అనేక విషయాలు చర్చించుకున్నామ‌న్నారు. గుంజాల లిపి భాషను భావితరాలకు తీసుకెళ్లాల్సి ఉంద‌ని చెప్పారు. గుంజాల అధ్యయన కేంద్రానికీ కొట్టిన జంగు పేరు పెట్టాలని త్వరలోనే కలెక్టర్ ను కలిసి విన్నవిస్తామ‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement