Saturday, December 7, 2024

Big Story | పేదల తిరుపతి కురుమూర్తి స్వామి.. నెల రోజులపాటు ఉత్సవాలు

  • అమ్మాపురంలో జాతర సందడి
  • చిన్నచింతకుంట మండలంలో సంబురాలు
  • భక్తజనంతో సందడిగా మారిన పాలమూరు జిల్లా
  • ఉద్దాల ఉత్సవం ప్రత్యేకం
  • చూసి తరించేందుకు తరలివచ్చిన జనం
  • జాత‌ర విశిష్ట‌త‌, విశేషాలు ఇవే..

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని చిన్న‌చింత‌కుంట మండ‌లం అమ్మాపురం వెళ్తున్నారు. పేదల తిరుపతిగా పేరుంగాంచిన కురుమూర్తి జాతరకు హాజరవుతారు. కాగా, మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ జాతర దాదాపు నెల రోజులపాటు జరుగుతుంది. కురుమూర్తి జాతరలో ‘‘ఉద్దాలు”(ఉద్దాలోత్సవం) అనే ఉత్సవం వైభవంగా జరుపుతారు. తెలంగాణ తిరుపతి, పేదల తిరుపతిగా కురుమూర్తి జాతరకు పేరుంది.

కార్తీక మాసంలో ప్రారంభం..

తెలంగాణ రాష్ట్రంలో కార్తీక మాసంలో ఏటా జరిగే జాతరల్లో ‘కురుమూర్తి’ జాతర ఒకటి. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సమీపంలో సప్తగిరుల మధ్య ఈ ఆలయం కొలువై ఉంది. దీపావళి సందర్భంగా (అక్టోబర్ 31న) కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. నవంబర్ 2వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 2వ తేదీన ధ్వజారోహనం, అష్టోత్తర శతాభిషేకం, స్వామి కళ్యాణం, మయూర వాహన సేవ నిర్వహించారు. 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పలు సేవలు జరిగాయి. ఇక 1‌‌0వ తేదీన అవభృత మంగళనీరాజనం నిర్వహిస్తారు. సుమారు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. కురుమూర్తిలో కొలువైన వేంకటేశ్వరుడు.. కురుమూర్తి రాయుడిగా పూజలందుకుంటాడు. ఈ జాతరకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను చ‌దివి తెలుసుకుందాం..

జాతరలో కార్యక్రమాలు

15న ప్రత్యేక పూజలతోపాటు హంసవాహన సేవ కార్యక్రమాలు
16న ఉదయం 8గంటల నుంచే పూజా కార్యక్రమాల తోపాటు శేషవాహన సేవ
17న ప్రత్యేక పూజలు, గజ వాహన సేవ
18న స్వామి వారికి స్వర్ణభరణములతో అలంకార ఉత్సవం, రాత్రికి అశ్వవాహన సేవ
19వ తేదీన ఉద్దాల ఉత్సవము, హనుమద్వాహన సేవ, గరరుడ వాహన సేవ
20న ఉదయం 8గంటల ఆవాహిత దేవతాపూజలు, హోమాదులు, శ్రీపుష్పయాగము, శాత్తుమురై తదితర ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఉంటాయి.
21న ఉదయం 9గంటలకు అవబృదము శాత్తుమురై, మంగళ నీరాజనముతో ప్రత్యేక పూజలు.
29న ఉదయం 9.45గంటలకు స్వామి వారి అలంకారం

- Advertisement -

కురుమూర్తి జాతర – ప్రధానమైన విషయాలు..

  • మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్‌ సమీపంలో సప్తగిరుల (శేషాద్రి,ఏకాద్రి, కోటాద్రి, ఘనాద్రి, భల్లూకాద్రి,పతగాద్రి,దేవతాద్రి) మధ్య కురుమూర్తి ఆలయం కొలువుదీరి ఉంది.
  • ప్రతి ఏడాది ఇక్కడ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఉత్సవాలు నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. నెలరోజుల పాటు జరుగుతాయి.
  • ఆధ్యాత్మిక శోభతో కురుమూర్తిలో 7 గుట్టలు దర్శనమిస్తాయి. ఈ కార్తీకమాసంలో జాతర సందర్బంగా ఇక్కడ గట్టు కొనభాగాన వెలిగించే దీపం అత్యంత మహిమాన్వితంతో చూస్తారు. చుట్టుపక్కల గ్రామాల వరకు ఈ దీపం వెలుగు కనిపిస్తుంది.
  • ఉత్సవాల్లో ప్రధానఘట్టమైన స్వామివారి కళ్యాణోత్సవం. అలంకారోత్సవం నవంబర్ 6వ తేదీన నిర్వహిస్తారు. 8వ తేదీన ఉద్దాలోత్సవం ఉంటుంది. ఈ ఉద్దాలోత్సవం రోజున 4 నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు తరలివస్తారని అంచనా. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేశారు.
  • ఈ ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను కొత్త చేటలో ఉంచి ఉద్దాల మండపం వద్దకు తీసుకువస్తారు. స్వామివారికి ఉద్దేశించిన పాదుకలను ఉద్దాలు అనడం ఆనవాయితీ. కురుమూర్తి ఆలయంతో ఎరుకల, మేదరి కులస్తులకు, దళితులకు విడదీయరాని అనుబంధం ఉంటుంది.
  • పల్లమర్రి గ్రామానికి చెందిన మేదర కులస్తులు ప్రత్యేక చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభించి ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు భక్తి శ్రద్దలతో అందజేస్తారు. వడ్డెమాన్‌ గ్రామంలో దళితుల సమక్షంలో ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు.
  • దీపావళి అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో ఉద్ధాలు తయారు చేస్తారు. ఉత్సవాల సమయానికి చేటలో పాదుకలు ఉంచి ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు.
  • ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు. ఈ ఉద్దాల విషయంలో అనేక అభిప్రాయాలు ఉన్నాయి.
  • కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం ఉంది. అదే ‘తలియకుండ’ ఆచారం. ఇది మట్టికుండ అని కూడా అంటారు. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు ప్రత్యేకంగా ఈ కుండని నియమ నిష్ఠలతో తయారుచేస్తారు. అనుకున్న సమయానికి ‘తలియకుండ’ ను ఆలయ లాంఛ‌నాలతో ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.
  • కురుమూర్తి అసలు పేరు ‘కురుమతి’ అని పండితులు పేర్కొంటున్నారు. కురు అనగా ‘ చేయుట ‘ అని, మతి అనగా ‘తలుచుట ‘అని అర్థం. అంటే ఏది కోరినా చేసి పెట్టే తలంపు ఈ క్షేత్రానికి ఉందని భావిస్తారు. మొత్తానికి కాల క్రమంలో కురుమతి… కురుమూర్తిగా మారిపోయిందని పండితులు చెబుతుంటారు.
  • 1968లో కురుమూర్తి ఆలయం దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా నేటికి ముక్కెర వంశస్థులు విచ్చేసి ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
  • కురుమూర్తి స్వామి మహిమలు గురించి అనేక కథనాలు జనుల నోళ్ల‌ల్లో వినబడుతుంటాయి. వివిధ నమ్మకాలను భక్తులు పాటిస్తుంటారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారిని హంస వాహనంపై ఊరేగిస్తారు.
  • కురుమూర్తి జాతర ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్నాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టారు.
  • హైద‌రాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంజీబీఎస్ నుంచి ఆరాంఘ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మీదుగా జాత‌ర‌కు బ‌స్సులు న‌డుపుతున్నారు. ఈ స్పెష‌ల్ బ‌స్సుల్లో ముంద‌స్తు రిజ‌ర్వేష‌న్‌ను కల్పిస్తున్నారు. టికెట్ల బుకింగ్ కోసం http://tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్ర‌దించ‌వచ్చు.
Advertisement

తాజా వార్తలు

Advertisement