Sunday, January 16, 2022

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలపై పటిష్ట నిఘా

మావోయిస్టుల వారోత్సవాల సంద‌ర్బంగా తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో పటిష్ట నిఘా ఉంద‌ని జైపూర్ ఏసీపీ న‌రేంద‌ర్ అన్నారు. ఈనెల 2 నుంచి 8 వరకు మావోయిస్టు (పీఎల్జీఏ) ఆవిర్భావ వారోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్, ఓఎస్డీ రామగుండం, మంచిర్యాల డీసీపీ ఆదేశాల మేర‌కు ముందస్తుగా జైపూర్ ఏసీపీ న‌రేంద‌ర్ తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో ప‌ర్య‌టించి పోలీసులను అప్రమత్తం చేశారు. కోట‌ప‌ల్లి మండ‌లంలోని రాప‌న‌ప‌ల్లి గ్రామం స‌మీపంలోని అంత‌రాష్ర్ట వంతెన వద్ద చెన్నూర్ రూర‌ల్ సీఐ నాగ‌రాజు, కోట‌ప‌ల్లి ఎస్ఐ ర‌వి కుమార్ ఆద్వ‌ర్యంలో జ‌రుగుతున్న త‌నిఖీల‌ను ప‌రిశీలించి స‌రిహ‌ద్దు భ‌ద్ర‌త పై ఏసీపీ ప‌లు సూచ‌న‌లు చేశారు. స‌రిహ‌ద్దుల్లో వాహ‌నాల‌ను త‌నిఖీ చేసిన ఏసీపీ వాహ‌న‌దారుల వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ వాహ‌నాల‌తో పాటు ఆర్టీసీ బ‌స్సుల్లో త‌నిఖీలు నిర్వ‌హించిన పోలీసులు అనుమానితుల‌ను విచారించారు.

ఈ సంద‌ర్బంగా ఏసీపీ మాట్లాడుతూ… చెన్నూరు రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రాణహిత పరివాహక ప్రాంతాల్లోని ఫెర్రీ పాయింట్ లలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని, మావోయిస్టు సానుభూతిపరులు, మాజీ మిలిటెంట్లను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నట్లు తెలిపారు. మ‌న జిల్లాలో మావోల క‌ద‌లిక‌లు ఏమాత్రం లేవ‌ని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మావోయిస్టుల వారోత్సవాల సంద‌ర్బంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా తెలంగాణ‌-మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో 24 గంట‌ల పాటు త‌నిఖీల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు వివరించారు. స‌రిహ‌ద్దుల్లో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయ‌డంతో పాటు ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలతో నిఘాను ఏర్ప‌రిచిన‌ట్లు వివ‌రించారు. స‌రిహ‌ద్దు గ్రామ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, గ్రామాల్లోని కొత్త వ్య‌క్తులు వ‌చ్చినా, అనుమానాస్ప‌దంగా సంచ‌రించినా పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌న్నారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News