Saturday, April 20, 2024

Big story : దక్షిణ మధ్య రైల్వేలో ముఖ్యమైన నూతన రైల్వే మార్గం ఇదే.. ఉమ్మడి పాలమూరు జిల్లాకూ కీలకం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : దక్షిణ మధ్య రైల్వే కొత్త రైల్వే ప్రాజెక్టులు, నూతన రైల్వే లైన్‌ల ఏర్పాటుపై గత కొద్ది రోజులుగా ముమ్మరంగా కృషి చేస్తోంది. ఇప్పటి దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల కొత్త లైన్‌లను పూర్తి చేసిన ద.మ రైల్వే తాజాగా ఇటు తెలంగాణ – కర్నాటక రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలను కలిపే నూతన లైన్ల నిర్మాణంపై చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మునీరాబాద్‌ మహబూబ్‌ నగర్‌ మార్గంలోని కొత్తలైన్‌ను ఏర్పాటు చేస్తోంది. అంతరాష్ట్రాలను కలిపే ఈ లైన్‌ ద.మ రైల్వేకే కాదు, తెలంగాణ ప్రజలకూ అత్యంత ముఖ్యమైన నూతన రైల్వే లైన్‌ కూడా కావడం గమనార్హం.

ఈ క్రమంలో నారాయణపేట జిల్లా జక్లేర్‌- మక్తల్‌- మాగనూరు రైల్వే లైన్‌ పనులు పూర్తి చేసింది. మరి కొన్ని మాసాల్లోనే ఇది కర్నాటక రాష్ట్రానికి చేరి రాయచూరును కలుపుకోనుంది. ఇది గనుక పూర్తి అయితే సిమెంట్‌ ఇనుప ఖనిజం, ఉక్కు వంటి సరుకు రవాణాలో తెలంగాణ ముందంజలో ఉండబోతోంది.

పూర్తయిన ‘ జక్లేర్‌ – మాగనూర్‌ ‘ లైన్‌

ఉమ్మడి నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం జక్లేర్‌ నుండి మక్తల్‌- మాగనూరు వరకు ఈ రైల్వే లైన్‌ ఇటీవలే పూర్తి కాగా దమ రైల్వే నుండి అధికారులు తనిఖీలు కూడా పూర్తి చేశారు. మహబూబ్‌నగర్‌ నుండి మునీరాబాద్‌ వరకు సుమారు 245 కిలో మీటర్ల దూరం మేర చేపట్టనున్న ఈ ప్రాజెక్టును దక్షిణ మద్య రైల్వే మరియు సౌత్‌ వెస్టర్న్‌ రైల్వేలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ద్వారా నిర్మించబడ్డ మహబూబ్‌నగర్‌ – కృష్ణా స్టేషన్‌ లో గల మహబూబ్‌నగర్‌ – దేవరకద్ర లైన్‌ ఇది వరకే నిర్మించబడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా దక్షిణ మద్య రైల్వే దేవరకద్ర నుండి వయా జక్లేర్‌- మక్తల్‌ మీదుగా కృష్ణా వరకు 66 కిలో మీటర్ల దూరం మేర కొత్త బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ను నిర్మిస్తోంది.

ఈ కొత్త ప్రాజెక్టు 1997-98 సంవత్సరంలో మొత్తం రూ. 3473 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు మంజూరు కాగా ఇందులో ద.మ రైల్వే వాటా 878.64 కోట్లుగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌ మరియు కర్నాటకలోని మైనింగ్‌ ప్రాంతాల మధ్య రైలు మార్గం పరిధిని విస్తరించడంలో సహాయపడనుంది. ప్రయాణికులు మరియు సరుకు రవాణాకు ప్రయోజనం చేకూరుస్తుందని దమ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ చెబుతున్నారు. ఇది దేవరకద్ర మరియు కృష్ణా మార్గంలో వయా జక్లేర్‌ – మక్తల్‌ మీదుగా రైల్వే లైన్‌ నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా దేవరకద్ర మరియు కృష్టా మధ్య ఉన్న సెక్షన్‌ దక్షిణాది రాష్ట్రాలలోనే అనేక ముఖ్యమైన నగరాలను చేరుకునేందుకు అతి దగ్గరి రైలు మార్గం ఇదే కానుండడం విశేషం .

- Advertisement -

ఇక్కడి నుండి అటు రాయాచూర్‌, గుంతకల్‌ , తిరుపతి, లేదా బళ్లారి, హుబ్లి గోవా మరియు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ వైపు రైల్వే లైన్లు వెళ్తున్నాయి. గూడ్స్‌ రైళ్లకు ఈ మార్గం అత్యంత అనుకూలం కాబోతోంది. ముఖ్యంగా ఇనుప ఖనిజం మరియు సిమెంట్‌ ఉక్కు మొదలైన ఇతర ముడి సరుకులను ఈ మార్గంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలకు తరలించేందుకు వీలుపడనుంది. దేవరకద్ర – జక్లేర్‌ మధ్య 28 కిలో మీటర్ల సెక్షన్‌ పనులు 2017 మార్చిలో పూర్తి కాగా, అటు జక్లేర్‌ – మాగనూర్‌ సెక్షన్‌ పనులు ఇటీవలే పూర్తయ్యాయి. మాగనూర్‌ నుండి కృష్ణా మధ్యన 13. 2 కి.మీల మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులను త్వరలోనే పూర్తి చేయిస్తామని దమ రైల్వే ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా కృష్ణా – రాయచూర్‌ , వాడి – గుంతకల్‌ ప్రధాన మార్గంలో ఇప్పటికే లైన్‌ ఉంది. దీనికి అనుకొనే సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే పరిధిలో మునీరాబాద్‌ – రాయచూరు లైన్‌ మార్గంలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement