Thursday, April 25, 2024

ట్రైబ్యునల్ ఏర్పాటుతోనే కృష్ణా జలాల సమస్యకు పరిష్కారం..

ప్ర‌భ‌న్యూస్: కృష్ణా జలాల వివాదం విషయంలో ట్రిబ్యునల్‌ తీర్పే అంతిమమని, ట్రిబ్యునల్‌ ఏర్పాటుతోనే ఈ వివాదం పరిష్కారమవుతుందని తెలంగాణ తేల్చిచెప్పింది. ఈ మేరకు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదంపై బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ తొలిరోజు విచారణ చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర మాజీ ఈఎన్సీ ఘనశ్యాం విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదం విషయంలో నీటి కేటాయింపుల అధికారం కేవలం ట్రిబ్యునల్‌కే ఉంటుందని ఈ విషయంలో పార్లమెంట్‌కు కూడా ఎలాంటి అధికారాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన చట్టంలోని నిబంధనల ఏర్పాటు చేసిన కేఆర్‌ఎంబీ ఇచ్చిన ప్రాజెక్టుల లిస్టు కేవలం తాత్కాలికమేనని అది అంతిమం కాదని విచారణలో స్పష్టం చేశారు.

శ్రీశైలం ఎడమ కాల్వకు సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులు జరపలేదని కేవలం శ్రీశైలం రైట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఆర్‌బీసీ)కు మాత్రమే సీడబ్ల్యూసీ కేటాయింపులు జరిపిందని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ నీటి కేటాయింపులు జరిపే సమయానికి ఎస్‌ఎల్‌బీసీ ఇంకా నిర్మాణం పూర్తి కాలేదని ట్రిబ్యునల్‌కు వివరించారు. అదే విధంగా కృష్ణా వాటర్‌ డిస్ట్రిక్ట్‌ ట్రిబ్యునల్‌-1 తీర్పు ప్రకారం నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు జరిపిన తర్వాతే బేసిన్‌ అవతల ఉన్న నీటి డిమాండ్లను తీర్చాలని స్పష్టం చేసిందని చెప్పారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కృష్ణా నీటి తరలింపు విషయంలో కేడబ్ల్యూడీటీ-2 ఇచ్చిన తీర్పే అంతిమమని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును ట్రిబ్యునల్‌ గుర్తించలేదని, ఇప్పటి వరకు స్పందించలేదని విచారణలో వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement