Wednesday, April 24, 2024

గౌరవ వేతనం ఇచ్చే వరకు పోరాటం ఆగదు.. రేషన్ డీలర్లు

నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 28 (ప్రభ న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అందించి, రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయకోటి రాజు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిజామాబాద్ నగరంలోని బసవ గార్డెన్ లో రేషన్ డీలర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి నామమాత్రపు కమిషన్ల స్థానంలో గౌరవ వేతనం సాధనకై జిల్లా అధ్యక్షుడు అతిమల నాగేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రేషన్ డీలర్ల జేఏసీ చైర్మన్ నాయకోటి రాజు, జేఏసీ దొమ్మటి కన్వీనర్ రవీందర్, వైస్ చైర్మన్ కన్వీనర్ బత్తుల రమేష్, రాష్ట్ర జేఏసీ కోకన్వీనర్ మల్లికార్జున్, బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జేఏసీ చైర్మన్ నాయికోటి రాజు మాట్లాడారు. తమిళనాడు, కేరళలో రేషన్ డీలర్లకు అక్కడి ప్రభుత్వం గౌరవ వేతనం అందిస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం ఎందుకు ఇవ్వరంటూ సీఎం కేసీఆర్ నీ ప్రశ్నించారు. అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రంలోని దేశం రేషన్ డీలర్లకు తక్కువ శాతం కమిషన్ ఇవ్వడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్లు ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. మనలో మనం ఐక్యత లోపించడంతోనే మన హక్కులు సాధించలేక పోతున్నామని వాపోయారు. 2010 సంవత్సరంలో రేషన్ డీలర్లకు గౌరవ వేతనం అందించాలంటూ అప్పటి సీఎంకు వినతి పత్రం కూడా అందజేసినట్లు వెల్లడించారు.

రేషన్ డీలర్లకు ఒక భద్రత కావాలని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చే కమిషన్ స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా గౌరవ వేతనం సాధించే వరకు పోరాటం ఆగదని పేర్కొన్నారు. రేషన్ డీలర్లకు వయసుతో నిమిత్తం లేకుండా గౌరవ వేతనం అందించి, రేషన్ డీలర్ల సమస్యలపై 21 డిమాండ్లతో ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్లపాత్ర కీలకమని తెలిపారు. రైస్ మిల్లర్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ, సహకారాలు అందిస్తుందని, కానీ రేషన్ డీలర్ల సమస్యలను ఎందుకు పరిష్కరిస్తా లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల జూన్ 5 తర్వాత ప్రజలకు రేషన్ సరుకులు అందించకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తూ జూన్ 5 తర్వాత సమ్మె చేపడుతామని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి గౌరవ వేతనం అందించే వరకు మనం పోరాడుదామని పిలుపునిచ్చారు. అనంతరం ముఖ్య అతిథులను జిల్లా కార్యవర్గం, రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అతిమల నాగేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిట్టి పార్థసారథి, గౌరవ అధ్యక్షులు గంగా కిషన్, నవిపేట అధ్యక్షులు సత్యనారాయణ, కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శoకర్ రావు, నాగం సురేందర్, పోల్కం గంగాకిషన్, శ్రీధర్, వజీర్, గౌరీ శెట్టి రాజన్న అర్బన్ మండల్ ప్రవీణ్ యాదవ్, విక్కి, రూరల్ మండల్ రఘు జిల్లాలోని రేషన్ డీలర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement