Wednesday, April 24, 2024

ఈనెల 14న బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభం.. నాగార్జున సాగర్‌లో 274 ఎకరాల్లో నిర్మాణం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాగార్జున సాగర్‌లో 274 ఎకరాల్లో నిర్మించిన బుద్ధవనంను ఈనెల 14న పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఉన్నతాధికారులతో బుద్ధవనం ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సిఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఆసియాలోనే అతి పెద్ద బుద్ధవనం ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించామని శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఆచార్య నాగార్జునుడు 2000 వేల సంవత్సరాల క్రితం నడియాడిన ప్రదేశంగా , బౌద్ధ చరిత్ర ఆధారంగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. ఈనెల 14న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా బుద్ధవనం ప్రారంభమవుతుందని, మరోమంత్రి జగదీష్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆయన తెలిపారు.

బుద్దవనం ప్రాజెక్టులో బుద్ధ చరితవనం, జాతక వనం (బుద్ధ సత్వ పార్కు),ధ్యానవనం, స్థూపవనం, మహాస్థూప, బుద్ధిజం, టీచింగ్‌ అండ్‌ ఎడ్యూకేషన్‌ సెంటర్‌, హాస్పిటాలిస్‌, వెల్ఫేర్‌ సెంటర్‌ నిర్మాణాలను ఉన్నత ప్రమాణాలతో నిర్మించామన్నారు. అలాగే వివిధ దేశాలకు చెందిన 13 బౌద్ధ స్థూపాల నమోనాలు ఉన్నాయన్నారు. వంద అడుగుల ఎత్తు, 200 అడుగుల వ్యాసంతో చుట్టూ ప్రదక్షణల పథకంతో బౌద్ధ స్థూపం, చుట్టూ వేలాకొలది శిల్పాలను నిర్మించామన్నారు. బుద్ధిస్ట్‌ ఆధ్యాత్మిక పర్యాటకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఆకర్షించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ సమీక్షలో తెలంగాణ టూరిజం ఎండి మనోహర్‌, బుద్ధవనం స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లెపల్లి లక్ష్మయ్య, చరిత్రకారులు డాక్టర్‌ ఈమని శివానాగి రెడ్డి సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement