Thursday, April 18, 2024

కేసీయార్ కళ్లు నెత్తికెక్కాయి.. అందుకే వాడు-వీడు అంటూ మాట్లాడుతున్నారు: బండి సంజయ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కళ్లు నెత్తికెక్కాయని, అందుకే ప్రధానిని వాడు-వీడు అంటూ మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీయార్ మీడియా సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించిన బండి సంజయ్, సీఎం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. కేసీయార్ ముందు సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. కేసీయార్ కేంద్ర మంత్రిగా పనిచేసినప్పుడు ఈఎస్ఐ, సహార కుంభకోణాలు చేశారని, వెలుగుబంటి సూర్యనారాయణతో కలిసి దోచుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

ఇప్పుడు సీఎంగా వేల కోట్లు దోచుకుతింటున్నారని, వాటిని కూడా బయటకు తీస్తున్నామని అన్నారు. కొత్త రాజ్యాంగం రాయాలన్న కేసీయార్ మాటలను తప్పుబడుతూ భారత రాజ్యాంగాన్ని కల్వకుంట్ల రాజ్యాంగంగా మార్చాలనుకుంటున్నావా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని తిరగరాయాలన్న వ్యాఖ్యలతోనే అక్కసు బయటపడిందని, మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్‌ను దారుణంగా అవమానించారని మండిపడ్డారు.

కేసీయార్ భాష చూసి తెలంగాణ ప్రజలే ఛీకొడుతున్నారని బండి సంజయ్ అన్నారు. పిచ్చి పట్టినట్టుగా వ్యవహరిస్తున్న కేసీయార్ వంటి నేతల కోసమే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో మానసిక ఆరోగ్యం కోసం నిధులు కేటాయించిందని ఎద్దేవా చేశారు. ప్రపంచమంతా కొనియాడే రాజ్యాంగాన్ని తిరగరాయాలనడంలోనే కేసీయార్ అహంకారం, దళితులపై ఉన్న చిన్నచూపు, కుట్ర బయటపడిందని అన్నారు. కేసీయార్ దళిత ద్రోహి అని మరోసారి నిరూపించుకున్నారని, రాష్ట్రపతి దళితుడు కాబట్టే ఆయన ప్రసంగాన్ని బహిష్కరించాలని తన ఎంపీలకు చెప్పారని ఆరోపించారు.

కేసీయార్ ఏనాడూ అంబేద్కర్ జయంతి, వర్దంతికి రాలేదని, 125 అడుగుల విగ్రహాన్ని పెట్టలేదని గుర్తుచేశారు. దళిత సమాజం సీఎం వ్యాఖ్యలపై స్పందించాలని, లేదంటే కేసీయార్ ఇంకా బరితెగించి మాట్లాడతారని అన్నారు. కేసీయార్‌పై దేశద్రోహం కేసు పెట్టాల్సిందేనని బండి సంజయ్ అన్నారు. కేసీయార్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇదంతా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తానే మేధావి అయితే రూ. 500 కోట్లు ముట్టజెప్పి ఒకాయనతో అగ్రిమెంట్ ఎందుకు చేసుకున్నారని ప్రశ్నించారు. కేసీయార్ దగ్గర తేలు మంత్రం ఉంటే, తమ దగ్గర పాము మంత్రం ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం మొత్తం కేసీయార్‌పై కసితో ఉందని, జైలుకు పోతే చప్పట్లు కొట్టే రోజులు రాబోతున్నాయని అన్నారు.

కనీస మద్ధతు ధర కోసం రూ. 2.37 లక్షల కోట్లు కేటాయిస్తే ఇది రైతుల బడ్జెట్ కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు ఎత్తేసి, ధాన్యం కొనబోమని కేసీయార్ అన్నారని గుర్తుచేశారు. కేంద్రానికి ధాన్యం కొనే ఆలోచన లేకుండా ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఎందుకు కేటాయిస్తుందని ప్రశ్నించారు. కరోనా వచ్చినప్పుడు కేసీయార్ ఎక్కడున్నారని, ఉచిత వ్యాక్సిన్ ఇచ్చిందెవరని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాల్లేక పేదలు చనిపోయినా స్పందించలేదని ఆరోపించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు.

- Advertisement -

“గుజారాత్, మధ్య ప్రదేశ్‌లో చేస్తున్న పథకాలు చెబుతా.. అమలు చేసే దమ్ముందా? ఏ రాష్ఠ్రానికి ఆ రాష్ట్రం ప్రత్యేకం. వాళ్ల ప్రజలకు కావాల్సిన అవసరాల మేరకు పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారు. నీ ప్యాంట్ సైజ్ నీది, నా ప్యాంట్ సైజు నాది. ఉత్తరప్రదేశ్‌లో ఏకమొత్తంగా ఒకేసారి రుణమాఫీ చేశారు. చత్తీస్‌గఢ్‌లో ఏడేళ్ల కిందనే రమణ్ సింగ్ ఆధ్వర్యంలో, అంతకంటే 12 ఏండ్ల ముందు గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చింది” అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. మిషన్ భగీరథ పథకం కంటే ముందు గుజరాత్ వెళ్లి సుజలాం – సుఫలాం పథకం సూపర్ అని ఎందుకు కితాబిచ్చారో గుర్తుచేసుకోవాలని అన్నారు.

ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్‌పై భారత ప్రధాన న్యాయమూర్తినే వివాదాస్పదం చేసిన ఘనుడు కేసీయార్ అని బండి సంజయ్ అన్నారు. యూపీలో సీట్లు తగ్గుతాయన్న వ్యాఖ్యలపై బదులిస్తూ.. కారు, సారు, పదహారు అంటూ, బీజేపీ ఎక్కడుంది అన్నారని, హుజూరాబాద్‌లో, దుబ్బాక, జీహెచ్ఎంసీలో బీజేపీ ఎక్కడుందో చూపెట్టామని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కేసీయార్‌కు మిగిలేది 5 సీట్లే అన్నారు. మోదీని అప్రతిష్టపాలుచేసే కుట్రలో భాగంగానే కేసీఆర్ నీచమైన, బూతు భాషను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని గూగుల్‌లో వెతికితే కేసీయార్ అని కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. తమపై ఎన్ని దాడులు చేసినా భయపడే ప్రసక్తే లేదని, జైళ్లు తమకు కొత్త కాదని బండి సంజయ్ అన్నారు.

కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడుతూ.. దేశానికి విప్లవాత్మకమైన, చారిత్రత్మకమైన బడ్జెట్ అని కొనియాడారు. కరోనా సమయంలో పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తారని మేధావులు, ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్న తరుణంలో ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ ప్రవేశపెట్టారని మెచ్చుకున్నారు. ప్రధాని మోదీ, నిర్మల సీతారామన్ దేశం కోసం జీవితాలను ధారపోస్తున్నారని, పైసా అవినీతి లేకుండా అహర్నిశలు పనిచేస్తున్నరని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement